ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. నల్లగొండ కలెక్టరేట్ ముట్టడించిన బీఆర్ఎస్

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులపై నిరసనగా బీఆర్ఎస్ (BRS) శ్రేణులు సోమవారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఈ ఆందోళనకు చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah), జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి (Banda Narender Reddy) నేతృత్వం వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సమస్యల పరిష్కారం కోరుతూ జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలలో సరిపడా లారీలు లేకపోవడంతో వడ్లు రోజుల తరబడి పేరుకుపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతం, నాణ్యత పేరుతో రైతుల ధాన్యంపై అనవసర కోతలు విధిస్తూ ఆర్థికంగా నష్టపరుస్తున్నారని మండిపడ్డారు.

దళారులు, మధ్యవర్తులు అధికారులతో కుమ్మక్కై తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలలో తార్పాలిన్లు, త్రాగునీరు, నీడ వంటి కనీస వసతులు కూడా లేవని విమర్శించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. మార్కెట్ యార్డులలో కాంగ్రెస్ నాయకుల పెత్తనం పెరిగిపోయిందని, దీని వల్ల సామాన్య రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ‘దేశానికి అన్నం పెట్టే రైతును ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గం’ అంటూ చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతల వినతిపై స్పందించిన జాయింట్ కలెక్టర్.. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే 15 రోజులలో  పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>