కలం, మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం (Tripuraram) మండలంలో వ్యవసాయ బావిలో లభ్యమైన గుర్తుతెలియని మహిళ మృతదేహం కేసును నల్లగొండ జిల్లా పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానం, చాకచక్యం ఉపయోగించి కేవలం 24 గంటల వ్యవధిలోనే మృతురాలిని గుర్తించడంతో పాటు హంతకుడిని అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలానికి చెందిన తిరుపతమ్మగా గుర్తించారు. ఈ దారుణ హత్యకు ఒడిగట్టిన నిందితుడు లింగప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
త్రిపురారంలోని ఒక వ్యవసాయ బావిలో చేతులు కట్టేసి ఉన్న మహిళ మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్, ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరించాయి. మృతురాలి కాల్ డేటా, ఘటనా స్థలానికి వెళ్లే దారుల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లింగప్ప అనే వ్యక్తిపై పోలీసులకు బలమైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ దిశగా విచారణ జరపడంతో నిందితుడు దొరికిపోయాడు. పోలీసుల విచారణలో నిందితుడు లింగప్ప తన నేరాన్ని అంగీకరించాడు. తిరుపతమ్మతో ఉన్న అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు ఒప్పుకున్నాడు. వీరిద్దరి మధ్య తలెత్తిన గొడవలు, వివాదాల కారణంగానే ఆమెను వదిలించుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలోనే తిరుపతమ్మ చేతులు కట్టేసి, ఆమె చీరతోనే గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని త్రిపురారం పరిధిలోని వ్యవసాయ బావిలో పడేసినట్లు వెల్లడించాడు. నిందితుడి వద్ద నుంచి మృతురాలి సెల్‌ఫోన్, తాళిబొట్లు సహా కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య కేసును 24 గంటల రికార్డు సమయంలో ఛేదించిన మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, స్థానిక సీఐ, ఎస్సైలు, ప్రత్యేక బృందాల ప్రతిభను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు.

