కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన ‘జాతీయ లోక్ అదాలత్’ (Lok Adalat) నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.ప్రేమలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని కోర్టులలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే పని లేకుండా, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి కక్షిదారులకు లోక్ అదాలత్ ఒక అద్భుతమైన అవకాశమని వారు పేర్కొన్నారు.
ఈ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ఇతర చిన్న సులను కూడా ఇరుపక్షాల అంగీకారంతో త్వరితగతిన ముగించుకోవచ్చని వారు స్పష్టం చేశారు. ఇరుపక్షాల పరస్పర అంగీకారంతోనే నిర్ణయాలు జరుగుతాయని, అందువల్ల ఇక్కడ గెలుపోటములు అనే ప్రసక్తే ఉండదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇందులో వెలువడే తీర్పే అంతిమమైనదని, దీనిపై మళ్లీ పైకోర్టులలో అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. దీనివల్ల కక్షిదారులకు తక్షణమే తుది తీర్పు లభించడమే కాకుండా, కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ, సమయం, ఖర్చులు ఆదా అవుతాయన్నారు. కాబట్టి, జిల్లాలోని కక్షిదారులు ప్రతివాదులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ న్యాయవాదుల ద్వారా కానీ, లేదా నేరుగా సంబంధిత కోర్టులలో కానీ సంప్రదించి తమ పెండింగ్ కేసులను వెంటనే లోక్ అదాలత్ జాబితాలో చేర్చుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత పిలుపునిచ్చారు.

