కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) పట్టణంలోని చారిత్రక లతీఫ్ సాహెబ్ గుట్ట, బ్రహ్మంగారి గుట్టలపై జరుగుతున్న ఘాట్ రోడ్డు నిర్మాణ పనులపై నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇవి అసలు ఘాట్ రోడ్డు నిర్మాణ పనులా..? లేక గుట్టల కింద దాగి ఉన్న గుప్త నిధుల కోసం సాగుతున్న తవ్వకాలా..?” అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. శనివారం హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన భారీ బాంబు బ్లాస్టింగ్ ప్రమాద స్థలాన్ని, గుట్టలపై సాగుతున్న పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ తవ్వకాల వెనుక ఉన్న అసలు ఉద్దేశంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఘాట్ రోడ్డు నిర్మాణం పేరిట కొండలను విచక్షణారహితంగా 20 మీటర్లకు పైగా లోతుగా ఎందుకు తవ్వుతున్నారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. ఇంత లోతుగా తవ్వకాలు జరపడం వెనుక గుప్త నిధుల అన్వేషణ సాగుతోందా అనే అనుమానాలు స్థానికుల్లో బలంగా వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్, అంచనాలు, టెండర్ ప్రక్రియ వివరాలను మున్సిపల్ యంత్రాంగం ఎందుకు రహస్యంగా ఉంచిందో సమాధానం చెప్పాలని, ఆ రికార్డులను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. జనవాసాలకు అత్యంత సమీపంలో ఎలాంటి ముందస్తు రక్షణ చర్యలు లేకుండా భారీ ఎత్తున బాంబు బ్లాస్టింగ్స్ నిర్వహించడంపై కంచర్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అధికార పక్షానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకుల స్వప్రయోజనాలు, ఆర్థిక లాభాల కోసమే నిబంధనలను తుంగలో తొక్కి ఈ పనులు రాత్రింబవళ్లు జరిపిస్తున్నారని విమర్శించారు. కళ్ల ముందే ఇంతింత పెద్ద పేలుళ్లు జరుగుతున్నా మైనింగ్, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం చూస్తుంటే.. అధికారుల పూర్తి పర్యవేక్షణ మరియు అండదండలతోనే ఈ ఉల్లంఘనలు జరిగాయని స్పష్టమవుతోందని ఆరోపించారు. పేలుళ్ల తీవ్రతకు భయాందోళనలకు గురైన హౌసింగ్ బోర్డు కాలనీ వాసులకు కంచర్ల భూపాల్ రెడ్డి మద్దతుగా నిలిచారు. బండరాళ్లు పడి ఇళ్లు ధ్వంసమైన బాధితులకు కాంట్రాక్టర్, ప్రభుత్వం తరఫున తక్షణమే పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో బాధితుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

