కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ట్రాన్స్ జెండర్ల (హిజ్రా)పై అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారని పేర్కొంటూ ట్రాన్స్ జెండర్స్ జిల్లా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. గ్రామాభివృద్ధి కమిటీలు గ్రామాల్లోకి హిజ్రాలు రావద్దు అంటూ బహిరంగ పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఇటీవల సిరికొండ మండలం మైలారం గ్రామంలో చిన్నపిల్లల్ని అపహరిస్తున్నారని వారిపై భౌతిక దాడులకు దిగారని ట్రాన్స్ జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పుకార్లు అసత్యం అని స్థానిక పోలీసు అధికారులు కూడా జనాలకు చెప్పారని గుర్తు చేశారు. అంతేకాకుండా నందిపేట్ మండలం హుస్నాపూర్‌లో అక్రమంగా గ్రామ పంచాయతీలో నిర్బంధించారని వినతి పత్రంలో పేర్కొన్నారు.
మోపాల్ మండలం సిర్పూర్ గ్రామంలో హిజ్రాలు రావద్దంటూ బహిరంగంగా పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విధమైన చర్యలకు పాల్పడుతూ హిజ్రాలను సామాజిక బహిష్కరణ చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. శుభకార్యాలకు వెళ్లి ఆశీర్వదించి వారికి తోచింది ఇస్తే తీసుకుంటున్నామని, అదేవిధంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. అటువంటి మాపై ఈ విధంగా దుష్ప్రచారం చేయడం తగదని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను బహిష్కరిస్తే నేడు హిజ్రాలను కూడా బహిష్కరణకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్లపై ఇలాంటి నిర్బంధాలు, దుష్ప్రచారాలు, భౌతికదాడులు, బహిష్కరణలకు గురిచేస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, ట్రాన్స్ జెండర్లకు సామాజిక భద్రత కల్పించాలని కలెక్టర్‌కు విన్నవించారు.ఈ నిరసన కార్యక్రమంలో ఓరుగంటి గంగా, వంకాయల అక్షర, ఆర్తి, జరీనా బేగం, శ్యామల, ఆసది, అలక, ప్రియా తదితరులు పాల్గొన్నారు.

