కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్‌కు (CM Vijay) కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈ రోజు ఉదయం నుంచే జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అమలు చేస్తున్నారు. దీని ప్రకారం, 55 మంది కేంద్ర పారామిలటరీ భద్రతా సిబ్బంది 24 గంటల పాటు షిఫ్టుల వారీగా ముఖ్యమంత్రికి భద్రత కల్పిస్తుంటారు. వీరి వద్ద MP5 అత్యాధునిక ఆయుధాలుంటాయి. అదే సమయంలో, సీఎం భద్రతా బృందంలో 10 మందికి పైగా NSG కమాండోలు కూడా అదనంగా ఉంటారు. ఈ కమాండోలు సీఎంకు అత్యంత దగ్గరగా ఉండి.. చుట్టుపక్కల పరిస్థితులపై నిరంతరం కన్నేసి ఉంచుతారు.
నిఘా వర్గాల సమాచారంతో..
విజయ్ పార్టీ పెట్టిన తరువాత అసాంఘిక శక్తుల నుంచి ఆయనకు ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఆయనకు పరిమిత సంఖ్యలోనే కేంద్ర భద్రతా సిబ్బంది సెక్యూరిటీ ఇస్తున్నారు. ఇప్పుడు, ముఖ్యమంత్రి కావడంతో ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు విశ్లేషించాయి. ఈ మేరకు వెంటనే జడ్ ప్లస్ స్థాయి భద్రత కల్పించింది. దేశంలో ప్రస్తుతం 50 మంది వరకు జడ్ ప్లస్ భద్రతలో ఉన్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు విజయ్ కూడా చేరడం గమనార్హం.

