కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా సారపాకలో (Sarapaka) చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది. కాలయముడిలా దూసుకొచ్చిన డోజర్ ఒక కుటుంబాన్ని చిదిమేసింది. తండ్రి కళ్లముందే 16 ఏళ్ల కుమారుడు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకంగా మారింది. స్థానికుల వివరాల ప్రకారం, బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన చలికాని ప్రవీణ్ (43), అతని కుమారుడు గణేష్ (16) మంగళవారం ఒక శుభకార్యానికి హాజరై, విందు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. చందు బజార్‌లోని ప్రగతి స్కూల్ సమీపంలో రోడ్డుపైకి వచ్చిన సమయంలో, ఇరవెండి వైపు నుండి వస్తున్న మట్టి చదును చేసే డోజర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి వారిని ఢీకొట్టింది.
ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో తండ్రీకొడుకులిద్దరూ రక్తపు మడుగులో పడిపోయారు. తీవ్రంగా గాయపడిన గణేష్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన తండ్రి ప్రవీణ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కళ్లెదుటే తన కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక్క క్షణంలో జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబంలో ఎప్పటికీ పూడ్చలేని విషాదాన్ని మిగిల్చింది.

