కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో కల్తీ కారంపొడి విక్రయిస్తున్నారనే సమాచారంతో కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. గౌరిశెట్టి రమేష్, సిద్ధంశెట్టి చక్రపాణి కిరాణంతో పాటు సుగంధ ద్రవ్యాల దుకాణాల్లో సోదాలు జరిపి భారీ మొత్తంలో కల్తీ అనుమానిత నిల్వలను కనుగొన్నారు. పోలీసుల సమాచారంతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అంకిత్ రెడ్డి, రోహిత్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. సుమారు 47 బస్తాల కారంపొడి, రెండు బస్తాల పసుపు, బస్తా ధనియాల పొడిని స్వాధీనం చేసుకున్నారు. సదరు దుకాణాల నుంచి నమూనాలు సేకరించి, ల్యాబొరేటరీకి పంపించారు. ఫలితాలు వచ్చే వరకు స్టాక్ పూర్తిగా సీజ్ చేస్తున్నట్లు, సుగంధ ద్రవ్యాల అమ్మకాలపై పూర్తి నిషేధం విధించినట్లు వారు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్, ఎస్సైలు మామిడాల సురేందర్, శ్రీకాంత్, కానిస్టేబుల్ సాయిదీప్ పాల్గొన్నారు.

