Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రజా పాలనలో నిరంతర విద్యుత్ సరఫరా: డిప్యూటీ సీఎం భ‌ట్టి

కలం, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగ‌ళ‌వారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రజా ప్రభుత్వంలో అమలు చేస్తున్నామన్నారు. ఉచిత కరెంట్ ఇవ్వడమే కాకుండా క్వాలిటీ పవర్ సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 18,546 మెగావాట్ల రికార్డు స్థాయి పీక్ డిమాండ్ నమోదైనప్పటికీ, కనురెప్ప పాటు కూడా కరెంట్ పోకుండా నిరంతర విద్యుత్తును అందించి ఘనత సాధించిందని కొనియాడారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో పాటు వడ్డీ లేని రుణాల ఇచ్చామన్నారు. రాబోయే రోజుల్లో అత్యధిక వడ్డీ లేని రుణాలను రాష్ట్రంలోని మహిళలందరికీ అందిస్తామన్నారు. మహిళా సంఘాల ద్వారానే బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీలో తిప్పేలా విప్లవాత్మక నిర్ణయం ప్రజా ప్రభుత్వం తీసుకున్నదని వివరించారు.

రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున రూ.50-55 విలువైన సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానిదేన‌న్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ క్రమ పద్ధతిలో విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇకపై దళారీల ప్రమేయం లేకుండా ఈ నిధులను నేరుగా విద్యార్థుల ఖాతాలకే జమ చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల చొప్పున అర్హులైన ప్రతి వారికి ఇచ్చామన్నారు. ఈ ఏడాది కూడా ప్రతి నియోజకవర్గానికి అదనంగా మరో 2,000 ఇళ్లను కేటాయించబోతున్నట్లు హామీ ఇచ్చారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు కులమతాలతీతంగా ప్రమాదవశాత్తు రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నామని తెలిపారు.

బసవపురం భూ నిర్వాసితుల సమస్యలను ప్రస్తావిస్తూ వారికి పరిహారం త్వరగా అందేలా తక్షణ చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, శాసనసభ సభ్యులు నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, టీజిఎస్పీడీసీఎల్ సిఎండి జితేష్ వి పాటిల్ ఐ.ఏ.ఎస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి, తడక వెంకటేశం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>