కలం, వెబ్ డెస్క్ : బీఆర్‌ఎస్, బీజేపీలు వేర్వేరు కాదని, ఆ రెండు పార్టీలు రేపో మాపో కలిసిపోవడం ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. బీజేపీ అండతో ఎవరూ బాగుపడే ప్రసక్తి లేదని, రాష్ట్రంలో మార్పు కోరుకునే ప్రజలు బీఆర్‌ఎస్‌ను సాగనంపారని ఆయన పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో జరిగిన ఎన్‌ఎస్‌యూఐ (NSUI) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో చిట్‌చాట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి వ్యవహారశైలిపై మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏకంగా 14 సార్లు బి-ఫామ్ ఇచ్చి గౌరవించిందని గుర్తు చేసిన ఆయన, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలే తప్ప అనవసర విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, అటువంటి వ్యక్తిపై విమర్శలు చేయడానికి జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఎవరని ఆయన అన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌పై తను చేసిన విమర్శలను జీవన్ రెడ్డి ఒక్కసారి గుర్తు చేసుకోవాలని, కాంగ్రెస్‌ను విమర్శించే ముందు వాటికి సమాధానం చెప్పాలని సూచించారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై (Minister Ponguleti) వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేవలం బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని, హరీష్ రావు వద్ద నిజంగా ఆధారాలు ఉంటే గాంధీ భవన్‌కు వచ్చి చర్చకు కూర్చోవాలని సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా చేసే పస లేని ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన తెలిపారు.
నాదర్గుల్ భూముల కుంభకోణం బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగిందని, ఆ పార్టీ చేసిన దోపిడీ గురించి ప్రజలకు పూర్తి అవగాహన ఉందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గత పాలకులు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుప్పకూలుతోందని, అదే కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణపై స్పందిస్తూ, అది పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలోని అంశమని, తనకు ఉన్న సమాచారం ప్రకారం ఇప్పట్లో విస్తరణ ఉండే అవకాశం లేదని తెలిపారు. తామంతా ఎన్‌ఎస్‌యూఐ నుంచి వచ్చిన వాళ్లమని ఆయన పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకటస్వామి నేతృత్వంలో ఈ విభాగం మరిన్ని విజయాలు సాధించాలని మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆకాంక్షించారు.
Read Also: సీట్లు 400.. అప్లికేషన్లు 4,000.. ఆ సర్కారు బడిలో అడ్మిషన్ల జాతర!
Follow Us On: X(Twitter)

