తెలంగాణ బాటలో మహారాష్ట్ర.. అగ్రి పవర్‌కు ప్రత్యేక డిస్కం

కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే మహారాష్ట్ర కూడా వ్యవసాయ అవసరాలకు ప్రత్యేక డిస్కమ్‌ను ఏర్పాటు చేసింది. ఇంతకాలం ఉన్న డిస్కమ్‌ను రెండుగా విభజిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చల అనంతరం ఆమోదం లభించడంతో కొత్త డిస్కమ్‌కు అవసరమైన నిధులను కూడా సమకూర్చింది. వ్యవసాయ పంపుసెట్ల విద్యుత్ వినియోగ వ్యవసారాలన్నీ కొత్త డిస్కమ్ పరిధిలోకి వస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం సైతం వ్యవసాయ పంపుసెట్ల వినియోగంతో పాటు మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల లిఫ్టు పంపుల వినియోగాన్ని కొత్త డిస్కమ్ పరిధిలోకి తెచ్చి ‘రైతు డిస్కమ్’ అని విభజించిన సంగతి తెలిసిందే. కాస్త ఆలస్యంగానైనా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తరహాలోనే మహారాష్ట్ర కూడా వ్యవసాయ విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా డిస్కమ్‌ను (Solar Agro DISCOM) ఏర్పాటు చేయడం గమనార్హం.

కొత్త డిస్కమ్‌కు రెండున్నర వేల కోట్ల పెట్టుబడి :

ఇప్పటివరకూ ఉన్న మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని మహారాష్ట్ర ప్రభుత్వం విభజించి కొత్తగా సోలార్ అగ్రో పవర్ (Solar Agro DISCOM) అనే కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ఎంఎస్ఈబీ-ఎస్ఏపీఎల్ అని పేరు పెట్టింది. దీనికి రూ. 2,500 కోట్ల మూల ధనాన్ని (క్యాపిటల్) సమకూర్చింది. సొంతంగా ఆదాయ వనరులను సమకూర్చుకోడానికి షేర్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యి ఐపీఓ రూట్ ఎంచుకోడానికి కూడా మార్గం సుగమమైంది. షేర్ల విక్రయానికి కూడా మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సౌర కృషి వాహిని యోజన అనే స్కీమ్‌తో పాటు ఫీడర్ స్థాయి సోలరైజేషన్ స్కీమ్ అమలుకు కూడా ఈ కొత్త డిస్కమ్ నోడల్ ఏజెన్సీగా పనిచేయనున్నది. ఈ కొత్త డిస్కమ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్‌ల పరిధిలోకి వచ్చే వ్యవసాయ పంపుసెట్ల వినియోగానికి మాత్రమే పరిమితమవుతుంది. వ్యవసాయేతర అవసరాలన్నీ యధావిధిగా పాత డిస్కమ్ చూసుకుంటుంది.

డిస్కమ్ పూర్తిస్థాయి ఏర్పాటు తర్వాత ఫంక్షనింగ్ :

కొత్త డిస్కమ్ ఏర్పాటుకు మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో టెక్నికల్, లీగల్ ప్రాసెస్ మొత్తం పూర్తయిన తర్వాత లాంఛనంగా ఫంక్షనింగ్‌లోకి వస్తుంది. దాదాపు తొమ్మిది నెలల సమయం పట్టొచ్చని అంచనా. పాత డిస్కమ్ నుంచి సంక్రమించే అప్పులు, భవిష్యత్తులో కొత్త డిస్కమ్ ద్వారా అమలుకానున్న స్మార్ట్ మీటర్ల వ్యవస్త, డిజిటల్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎనర్జీ ట్రాన్సిషన్ లాంటి అవసరాలకు అదనంగా నిధులు సమీకరించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో దాదాపు రూ. 33 వేల కోట్ల విలువైన లాంగ్ టర్మ్ బాండ్లను కొత్త డిస్కమ్ జారీ చేయనున్నది. ఎలాగూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంప్రదాయ విద్యుత్ వినియోగం స్థానంలో సోలార్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నందున మొత్తం వ్యవసాయ విద్యుత్ వినియోగంలో దాదాపు 65% సోలార్ తదితర రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్‌ను వినియోగించాలన్నది కొత్త డిస్కం లక్ష్యం.

విద్యుత్ స్టోరేజీ కోసం దీర్ఘకాలిక ప్రణాళిక :

టెక్నాలజీలో వస్తున్న మార్పులు, పారిశ్రామిక అవసరాలతో పాటు గృహ విద్యుత్ వినియోగమూ పెరుగుతున్నందున సంప్రదాయేతర ఇంధన వనరులను వాడుకునేలా స్టోరేజీపైనా ఆ రాష్ట్రంలోని డిస్కమ్‌లన్నీ దృష్టి సారించనున్నాయి. రాబోయే పదేళ్లలో రాష్ట్రంలోని మొత్తం విద్యుత్ డిమాండ్‌లో కనీసం 10% లేదా 100 గిగావాట్ల విద్యుత్‌ను నిల్వ చేయడానికి ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఇందుకోసం ఆ రాష్ట్రంలో రానున్న ఆరేళ్ల కాలంలో పది రిన్యూవబుల్ ఎనర్జీ ఇండస్ట్రీ జోన్లను ఏర్పాటు చేసి 2036 నాటికి 15 జోన్లకు పెంచాలనుకుంటున్నది. ప్రతీ జోన్ కనీసం 100 MW సామర్థ్యంతో ఉంటాయి. ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లను సమకూర్చనున్నది.

Read Also: జనాభా లెక్కలు.. ఎన్నో ప్రశ్నలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>