కలం, కరీంనగర్ బ్యూరో : గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం సుమారు 8 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పులకు భారీ వడ్డీలు చెల్లిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కరీంనగర్‌కు (Karimnagar) వచ్చిన మహేష్ కుమార్ గౌడ్‌కు చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్‌లు, సొసైటీల పేరుతో విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ఆ అప్పులకే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల భారీ మొత్తంలో వడ్డీలు చెల్లిస్తోందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. సిరిసిల్ల ఇసుక మాఫియా, నేరెళ్ల బాధితులపై జరిగిన దాడులను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేశామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు.
గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం గణనీయమైన విదేశీ పెట్టుబడులు తీసుకురాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భారీ స్థాయిలో పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఢిల్లీలో లోపాయి కారు ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రైతు వ్యతిరేక చట్టాల వంటి కీలక అంశాలలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి సభ పూర్తిగా విఫలమైందని, కేంద్రంలో 11 ఏళ్ల పాలనలో సామాన్యులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం పడిందని, ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరచి వేలాది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తోందని, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు. రానున్న ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచి మరోసారి అధికారంలోకి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

