కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ అన్యాయంగా తిరస్కరించారని, ఆయనను ఉరి తీసినా తప్పు లేదని టీపీసీసీ చీఫ్ (TPCC Chief) మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్‌లో శనివారం మహేశ్ కుమార్ చిట్‌చాట్‌లో మాట్లాడారు. రాజ్యసభలో బలం పెంచుకునేందుకు బీజేపీ ఈ కుట్రకు తెరలేపిందన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ విషయంలో జరిగిన పరిస్థితులు చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేదా నియంత పాలనలో? అనే అనుమానం కలుగుతోందన్నారు. మీనాక్షిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, కేవలం నోటీసులు మాత్రమే వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. అసలు ఎఫ్ఐఆర్ లేనప్పుడు కేసు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఆర్‌వోకు నామినేషన్ తిరస్కరించే హక్కు లేకపోయినా తిరస్కరించారని మండిపడ్డారు.
ఇక మీనాక్షి నటరాజన్ గాంధేయ వాది అని, ఆమె నిజాయితీకి నిలువుటద్దం అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రధాని మంత్రి ఆఫీసు జోక్యం చేసుకొని మరీ ఈమె వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిడి వల్లనే ఆర్‌వో ఆమె నామినేషన్‌ను తిరస్కరించారని చెప్పారు. ప్రధాని మోదీ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. చివరికి సుప్రీం కోర్టులో కూడా న్యాయం జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ ఫాసిస్టు విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. మీనాక్షి తనకు సోదరి లాంటి వ్యక్తి అని పేర్కొన్నారు. 24 గంటల్లో ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం విచారకరమన్నారు. మీనాక్షి విషయంలో కొంత మంది బీజేపీ నేతలు సానుభూతి తెలిపినట్లు తెలిసిందని ఆయన వెల్లడించారు.
లీకులపై సీఎం సమగ్ర విచారణ
మీనాక్షి కేసు వివరాలు తెలంగాణ కాంగ్రెస్ నేతలే లీక్ చేశారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. బీజేపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. లీకు వీరుల గురించి సీఎం రేవంత్ రెడ్డి సమగ్రంగా విచారిస్తున్నారని తెలిపారు. బీజేపీ నేతలే ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి తమపై బురద జల్లుతున్నారని ఆగ్రహవం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విభేదాలు సహజమని, అంత మాత్రాన కుట్రకు పాల్పడరని స్పష్టం చేశారు. బీజేపీ ముందు ఓట్ చోరీ చేసి, ఇప్పుడు సీట్ చోరీకి పాల్పడిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఇంత దిగజారుడు రాజీకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రాజ్యాంగాన్ని దుర్మార్గంగా అవమానించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఇలాగే వ్యవహరించి ఉంటే మోదీ ప్రధాని అయ్యేవారా? ముఖ్యమంత్రి అయ్యేవారా? అని ప్రశ్నించారు.
షబ్బీర్ అలీ ఆరోపణలపై రియాక్షన్
మరో వైపు షబ్బీర్ అలీ ఆడియో లీక్, ఆయన చేసున్న ఆరోపణలపై తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని మహేశ్ కుమార్ అన్నారు. తన ఆస్తులు, తన వ్యక్తిత్వం గురించి నిజామాబాద్ ప్రజలకు పూర్తిగా తెలుసునన్నారు. చంద్రశేఖర్ రెడ్డిని స్వయంగా షబ్బీర్ అలీ (Shabbir Ali) సీఎం సమక్షంలో పార్టీలో చేర్పించారని చెప్పారు. షబ్బీర్ అలీకి ఇప్పటికే షోకాజ్ ఇచ్చినట్లు తెలిపారు. షబ్బీర్ అలీ మహిళలను చులకన చేసి మాట్లాడటం విచారకరమన్నారు. సదరు ఆడియో ఏడాది కిందటిదని, కేటీఆర్ ముందు మీనాక్షి నటరాజన్‌కు జరిగిన అన్యాయం పై స్పందించాలని అన్నారు. తన గురించి కేటీఆర్ కంటే హరీష్ రావుకు బాగా తెలుసునని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
బీఆర్ఎస్ నేతలు ఫోర్త్ సిటీని అడ్డుకుంటామనడం మూర్ఖత్వమని మహేశ్ కుమార్ (TPCC Chief) మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం లేదని, మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత కక్ష్యతో మాట్లాడితే సహించేది లేదన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం, భూ దోపిడీ, అప్పుపై వివరణ ఇచ్చి బస్సు యాత్ర, పాదయాత్రలు చేయాలని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డిది ముగిసిన అధ్యాయమని మహేశ్ కుమార్ అన్నారు.
బీజేపీ ఎంపీ అరవింద్ (MP Arvind) అరాచకం చేస్తామని నిస్సిగ్గుగా ఒప్పుకుంటున్నారని, ఇలాగే వ్యవహరిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడున్నఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కూడా ఓడిపోతారని విమర్శించారు. తెలంగాణ ప్రాంతీయ తత్వాం గురించి మాట్లాడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని, పవన్ కల్యాణ్ ఈ విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని రాష్ట్రాలు సమానమేనని స్పష్టం చేశారు.
Read Also: రాష్ట్రంపై కిషన్‌రెడ్డి కుట్రలు : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
Follow Us On: Instagram

