కలం, వెబ్ డెస్క్: తమిళనాడు ప్రజలు విజయ్‌ని గెలిపించినందుకు బాధపడుతున్నారని డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్ (Stalin) విమర్శలు గుప్పించారు. రోజురోజుకు నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. ముఖ్యమంత్రి విజయ్ మహిళల భద్రత గురించి ఎన్నికల ముందు చాలా మాట్లాడారని మండిపడ్డారు. మహిళలు, బాలికలకు తమ పార్టీ నేతలు రక్షణగా నిలుస్తారని ప్రచారం చేసుకున్నారని.. కానీ, ఇప్పుడు ఆయన పార్టీ నేతలే లైంగిక వేధింపులు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు అనేక రిపోర్టులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. టీవీకే నేతల నుంచి మహిళలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని డీఎంకే పార్టీ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.
సొంత ఎమ్మెల్యేలపై విజయ్‌కు నమ్మకం లేదు..
సీఎం విజయ్‌కు తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం, పట్టు లేవని స్టాలిన్ ఎద్దేవా చేశారు. అందుకే అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఎలాగైతే చేస్తుందో.. దానినే తమిళనాడులో విజయ్ ఫాలో అవుతున్నారని విమర్శించారు. బీజేపీ జిరాక్స్ కాపీలా టీవీకే పార్టీ తయారైందన్నారు. కనీసం ఓటేసిన సిరా గుర్తు చెరిగికపోకముందే.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరిపోయారన్నారు. కరూర్ తొక్కిసలాటపై జరుగుతున్న సీబీఐ విచారణ నుంచి తప్పించుకునేందుకే సీఎం విజయ్ ఢిల్లీకి వెళ్లారా.. అని ప్రశ్నించారు.

