Mobile Popup Ad
Mobile Popup Ad

రాష్ట్రంపై కిషన్‌రెడ్డి కుట్రలు : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

కలం, ఢిల్లీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు ఇవ్వొద్దంటూ అడ్డుపడుతున్నది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డేనని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ఆయా ప్రాజెక్టుల విషయంలో సంబంధిత శాఖల మంత్రులను విడిగా కలిసి నిధులు ఇవ్వొద్దంటూ చెప్తున్నారని, స్వయంగా ఆ మంత్రులే ఈ విషయాన్ని తనకు వివరించారని ఆయన అన్నారు. ఐఆర్ఎఫ్‌సీతో ఒప్పందం కుదిరినా నిధులు విడుదల కాకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారని ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, మూసీ పునరుజ్జీవనం.. ఇలాంటి అనేక ప్రాజెక్టులకు అనుమతులు రాకుండా, ఫండ్స్ రిలీజ్ కాకుండా కిషన్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం వివక్షతో వ్యవహరిస్తున్నా తెలంగాణకే చెందిన కిషన్రెడ్డి కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉండి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారని సీఎం ప్రశ్నించారు. ఇప్పటివరకు తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చిన నిధులెన్నో వివరించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.

వాళ్లది ఫెవికాల్ బంధం

బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం ఉన్నదనేది జగమెరిగిన సత్యమని, కేటీఆర్ చెప్పినట్లుగా కిషన్‌రెడ్డి డ్యాన్స్ చేస్తున్నారని సీఎం రేవంత్ (Revanth Reddy) ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పట్ల, అభివృద్ధి పట్ల, ప్రజల సంక్షేమం పట్ల కిషన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో మహారాష్ట్రతో కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడడంలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను, ఐదు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని, ఇప్పుడు తుమ్మిడిహెట్టి బ్యారేజీతో మహారాష్ట్రలోని 1500 ఎకరాలకు మాత్రమే ముంపు జరుగుతూ ఉంటే ఇప్పించలేరా అని ముఖ్యమంత్రి నిలదీశారు. మహారాష్ట్రలో బీజేపీ ముఖ్యమంత్రే ఉన్నారని, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడడంలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలను ప్రొటెక్ట్ చేయలేనప్పుడు కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉంటే ఎంత.. రిజైన్ చేస్తే ఎంత.. అని వ్యాఖ్యానించారు. ఆయన తప్పుకుంటే ఆ ప్లేస్‌లో కొత్తవారు వస్తారు కదా.. రాష్ట్రం కోసం ఏమైనా చేస్తారు కదా.. అని సీఎం అన్నారు.

క్రెడిట్ రాష్ట్రానికి రావొద్దనే..!

హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణలో సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లోనూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు వస్తాయని, కానీ ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపితే ఆ క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వానికి పోతుందనే దుగ్ధతో సిల్లీ రాజకీయాలు చేస్తున్నరని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘బీజేపీలోని లీడర్ల మధ్య అంతర్గత కలహాలతో మొత్తం ప్రాజెక్టునే పండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీకి తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలున్నా ప్రయోజనమే లేదు. నిజంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు ఆమోదం పొందాలని కిషన్‌రెడ్డి భావిస్తే.. మహారాష్ట్ర నుంచి 1500 ఎకరాల ఇవ్వకుంటే కేబినెట్ భేటీకి రానని ప్రధానికి కిషన్ రెడ్డి చెప్పాలి” అని సీఎం డిమాండ్ చేశారు. అప్పుడు ప్రధానే మహారాష్ట్ర సీఎంతో మాట్లాడి 1500 ఎకరాలు ఇవ్వరో చూసుకుందామన్నారు.

ఒంటరి భేటీలతోనే అన్యాయం

తెలంగాణ ప్రయోజనాల కోసం కిషన్‌రెడ్డి నిజాయితీగా పనిచేస్తే కేంద్రం నుంచి నిధులు ఎందుకు రావని సీఎం రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఆయా శాఖల కేంద్ర మంత్రులతో కలిసి చర్చించేటప్పుడు తనను ఒక్కసారైనా ఎందుకు తీసుకెళ్లలేదని అడిగారు. బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు రాజీనామా చేస్తామంటే ప్రధాని ఎందుకు నిధులు ఇవ్వరని ఆయన అన్నారు. హైదరాబాద్‌కు మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ రావద్దన్నదే కిషన్ రెడ్డి ప్లాన్ అని దుయ్యబట్టారు. ఒంటరిగా కేంద్ర మంత్రుల్ని కలుస్తూ రాష్ట్రానికి నిధులు ఇవ్వొద్దని చెప్తూ ద్రోహం చేస్తున్నారని కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.

అందుకే పవన్‌కు నో పర్మిషన్

హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయన్న కారణంగానే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్‌కు సభ పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వలేదని సీఎం రేవంత్ వివరించారు. ‘పవన్ కళ్యాణ్ తెలంగాణలో తిరగొచ్చు.. ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు.. ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.. కానీ సభలు పెట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు’ అని సీఎం తేల్చిచెప్పారు. రాష్ట్రంలోకి చాలా పార్టీలు వస్తున్నాయని, పోటీ చేస్తున్నాయని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే మాటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పారని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సభలు పెట్టుకుంటానంటే ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదని, దీనికి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

బీజేపీకి కిమ్ ఆదర్శం

బీజేపీ నాయకులు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను ఆదర్శంగా తీసుకున్నారని, ఎన్నికలు ఎలా జరిగినా ఫలితం మాత్రం ఆయన చెప్పినట్లే అక్కడ వస్తుందని, ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కూడా బీజేపీ నేతలు అదే తీరు ప్రదర్శించారని సీఎం రేవంత్ విమర్శించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించిన వ్యవహారంలో కిమ్‌ను బీజేపీ ఆదర్శంగా తీసుకున్నదని, ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా డ్రామా నడిపించిందని ఆరోపించారు. ‘‘ఇప్పటిదాకా బీజేపీ ఓట్ చోరీ చేస్తే తాజాగా సీట్ చోరీ చేసింది. చట్టంలో ఏది ఉంటే దాన్నే కోర్టు చెప్తుంది కదా. తప్పు రిటర్నింగ్ అధికారిది, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ది. రిటర్నింగ్ అధికారి బీజేపీ కార్యకర్తలాగా వ్యవహరించారు. మీనాక్షి నటరాజన్ విషయంలో ఓట్ చోరీ కాలేదుగానీ బీజేపీ సీట్ చోరీ చేసింది. ఉనికిలోనే లేని కేసుని ప్రస్తావించి ఆమె నామినేషన్‌ను తిరస్కరించి బీజేపీ అభ్యర్థి గెలిచేలా చేసుకుంది. ఇది సీట్ చోరీనే” అని మండిపడ్డారు. మీనాక్షి నటరాజన్ గాంధేయవాది యితే బీజేపీ మాత్రం గాడ్సే వాదాన్ని ఎత్తుకున్నదని, సహజంగానే మహిళా వ్యతిరేకిగా బీజేపీకి ముద్ర ఉన్నదని, ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల విషయంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాల్పడిందన్నారు. గాంధీ ఐడియాలజీని ఇండియాలో లేకుండా చేయాలన్నదే బీజేపీ లక్ష్యమన్నారు.

హిట్లర్ నాకు ఆదర్శమనలేదు

‘హైడ్రా అనే పదం హిట్లర్ కాలంలో ఉండేదని గుర్తుచేసి దానిని సంబోధించానే తప్ప హిట్లర్ నా రోల్ మోడల్ అని ఎక్కడా అనలేదు’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మీడియా నచ్చినట్లుగా వక్రీకరించిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ అంతా మీడియా ఊహగానాలేనని సీఎం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఉన్న 66 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు అర్హులేనని, కానీ రాజ్యాంగం ప్రకారం సీఎంతో కలిపి 18 మందికే అవకాశం ఉంటుందని తెలిపారు. వివిధ కారణాలతో కొందరికి ఇవ్వలేకపోతున్నామన్నారు. రాహుల్ గాంధీని ఎవరైనా కలవచ్చని చెప్పారు. దేశంలో పట్టణీకరణ పెరుగుతూ ఉన్నదని.. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో పాపులేషన్ పెరుగుతూ ఉన్నదని సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ప్రతి ఏటా 3% పాపులేషన్ పెరుగుతున్నదన్నారు. అందుకే ఈ ఆరు ప్రధాన నగరాలకు లక్ష కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని ప్రధానిని అడిగినట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>