కలం / జగిత్యాల: జగిత్యాల (Jagtial) పట్టణంలో ఆహార భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని యావర్ రోడ్డులో శ్రీనివాస టాకీస్ ఎదుట ఉన్న ఓ దోశ సెంటర్లో కొనుగోలు చేసిన వడలో బొద్దింక (Cockroach in Vada) కనిపించిందని బాధితుడు తెలిపారు. బుధవారం అర్థరాత్రి సమయంలో బాధితుడు తన పిల్లల కోసం సదరు దోశ సెంటర్లో ఇడ్లీ, వడ టిఫిన్‌ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి చేరుకున్న అనంతరం టిఫిన్ పార్సిల్‌ను తెరిచి పరిశీలించగా, వడలో బొద్దింక వేయించబడిన స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైయ్యారు.
ఈ విషయంపై దోశ సెంటర్ యజమానిని ప్రశ్నించగా, ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితుడు ఆరోపించారు. ఆహార పదార్థాల తయారీలో పరిశుభ్రత, నాణ్యత పాటించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉన్నప్పటికీ, ఘటనను యాజమాన్యం సీరియస్‌గా తీసుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బాధితుడు దోశ సెంటర్ ఎదుట ఆందోళనకు దిగారు.
పిల్లల కోసం తీసుకెళ్లిన ఆహారంలో బొద్దింక కనిపించడం తీవ్ర ఆందోళన కలిగించిందని, ఇలాంటి ఆహారాన్ని తెలియకుండానే పిల్లలు తిని ఉంటే వారి ఆరోగ్యానికి ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని అతను పేర్కొన్నారు. పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో ఆహార తయారీ సమయంలో పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా..? వంటగదులు, ముడి పదార్థాలు, నిల్వ విధానాలు, వంట నూనె నాణ్యతపై సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారా..? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
ఆహార పదార్థాల్లో పురుగులు, ఇతర అపరిశుభ్ర పదార్థాలు కనిపించడం వల్ల వినియోగదారుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల కోసం కొనుగోలు చేసే ఆహార విషయంలో నిర్వాహకులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై సంబంధిత ఆహార భద్రత, మున్సిపల్ అధికారులు స్పందించి, సదరు టిఫిన్ సెంటర్లో పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఆహార తయారీ విధానం, వంటగది పరిశుభ్రత, నిల్వ చేసిన పదార్థాల నాణ్యతను తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో సంబంధం ఉన్న ఇలాంటి అంశాలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా, పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫుడ్ స్టాల్స్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఆహార భద్రత ప్రమాణాలు అమలయ్యేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

