కలం, వనపర్తి: తెలంగాణలో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై రూపొందించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (El Nino Action Plan)ను ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి సెంటర్లో నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth)కి అందజేశారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, సాగునీరు, గ్రామీణాభివృద్ధి రంగాలను పరిరక్షించేందుకు కార్యాచరణను రూపొందించారు. ఈ కార్యాచరణ అమలుకు సుమారు రూ.802.92 కోట్ల నిధులు అవసరమని నివేదికలో అంచనా వేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డాక్టర్ చిన్నారెడ్డి (Dr Chinnareddy).. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి వివిధ శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. నీటి పొదుపు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, నాణ్యమైన విత్తనాల పంపిణీ, పశుగ్రాస భద్రత, ఉద్యాన పంటల విస్తరణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు.
జూలై 27 నాటికి రాష్ట్రంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే సుమారు 30 శాతం లోటు నమోదైందని, జలాశయాలు, భూగర్భ జలాల నిల్వలు తగ్గాయని నివేదిక పేర్కొంది. దీంతో వరికి బదులుగా కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, నూనెగింజలు, కూరగాయలు, పశుగ్రాస పంటల సాగును గ్రామాల వారీ ప్రణాళికతో ప్రోత్సహించాలని సూచించింది. ఈ పంటలకు అవసరమైన విత్తనాలను 75 శాతం సబ్సిడీపై అందించాలని సిఫార్సు చేసింది. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులు, ఫార్మ్ పాండ్లు, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్ పనులను విస్తృతంగా చేపట్టాలని నివేదిక పేర్కొంది.
అలాగే ఉద్యాన పంటలు, పశుగ్రాస బ్యాంకులు, గ్రామీణ ఉపాధి హామీ పనులు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి భద్రత, రైతులకు వాతావరణ ఆధారిత సాంకేతిక సలహాలు, ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్ జోక్యంతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి కీలక సిఫార్సులను ప్రభుత్వం ముందుంచింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుని ఖరీఫ్ పంటలను విజయవంతంగా సాగు చేసేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కమిటీ సూచించింది. ఈ కార్యాచరణను వెంటనే అమలు చేస్తే వ్యవసాయ ఉత్పత్తి, రైతుల జీవనోపాధి, తాగునీటి భద్రత, పశుగ్రాస లభ్యత, గ్రామీణ ఉపాధికి గణనీయమైన రక్షణ లభిస్తుందని నివేదిక స్పష్టం చేసింది.

