కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా మంకమ్మతోటలోని టీఎన్జీవోల కమ్యూనిటీ హాల్‌లో జిల్లా టీఎన్జీవో (TNGO) ల అధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి దాదాపు 200 మంది పంచాయతీ కార్యదర్శులు హాజరై తమ సమస్యలు, విధుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పరిపాలనా ఒత్తిళ్లు, న్యాయపరమైన అంశాలను జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసేది పంచాయతీ కార్యదర్శులేనని అన్నారు. బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు, త్రాగునీరు, డ్రైనేజీ, వీధిదీపాలు, పారిశుధ్యం, పల్లె ప్రకృతి వనం వంటి అనేక బాధ్యతలను కార్యదర్శులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజల ప్రాణాల రక్షణ కోసం ప్రభుత్వ ఉద్యోగులు అహర్నిశలు కష్టపడ్డారని గుర్తుచేశారు.
గ్రామ పంచాయతీల్లో పాలక మండలులతో పని చేసే సందర్భాల్లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని, సూడా పరిధిలోని అనుమతుల విషయంలో సంబంధం లేకున్నా కార్యదర్శులపై న్యాయపరమైన ఇబ్బందులు వస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రొబేషన్, రెగ్యులరైజేషన్, పెండింగ్ బిల్లులు తదితర అంశాల్లో న్యాయం చేయాలని కోరినట్లు చెప్పారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ మాట్లాడుతూ “పంచాయతీ సెక్రటరీ అని పిలిపించుకోవడం గర్వకారణం” అని పేర్కొన్నారు. అన్ని శాఖల పనులు నిర్వహించడం వల్ల ఒత్తిడి ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో ప్రజల ఆదరణ, గౌరవం పంచాయతీ కార్యదర్శులకే ఎక్కువగా ఉంటుందని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుంటున్నామని, వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
సూడా అనుమతులు, ప్రొబేషన్, రెగ్యులరైజేషన్, ట్యాక్స్ కలెక్షన్, పీడీ అకౌంట్ తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి నెలా నాలుగో శనివారం పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. ఉద్యోగులు యూనిటీగా ఉండాలని, లౌక్యంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, టీఎన్‌జీవోల కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు రాజేష్ భరద్వాజ్, సుస్మిత, గోదావరి అజయ్, రాకేష్, రేవంత్ రెడ్డి, కిరణ్ వాహజ్, మధుమిత, కార్తీక్, మహేందర్ రావు తదితర ఉద్యోగ సంఘ నాయకులు, పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

