epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రైతుల సౌకర్యానికే యూరియా యాప్​ : మంత్రి తుమ్మల

కలం, వెబ్​ డెస్క్ : యూరియా యాప్​ కేవలం రైతుల సౌకర్యార్థం తీసుకువచ్చామని వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావు (Thummala Nageswara Rao) తెలిపారు. సోమవారం ఫెర్టిలైజర్ (యూరియా) యాప్ (Urea App) , యూరియా పంపణీలపై చీఫ్ సెక్రటరీ, స్పేషల్ చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ కలిసి మంత్రి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, యూరియా ఆన్ లైన్ బుకింగ్​ యాప్​ లో అప్పుడప్పుడు కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరిస్తున్నారని, రైతులు కూడా యూరియా యాప్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. యాప్ ద్వారా యూరియా అమ్మకాలు పారదర్శకంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.

రాష్ట్ర రైతులకు రబీ సీజన్‌ కోసం అవసరమైనంత యూరియా నిల్వ రాష్ట్ర ప్రభుత్వం వద్ద పూర్తిగా అందుబాటులో ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ రబీకి కేంద్ర ప్రభుత్వం మొత్తం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా, అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు రావాల్సిన 5.60 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 5.70 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయని వివరించారు.

2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది

గత సంవత్సరం ఇదే సమయానికి 2.81 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరగగా, ఈ సీజన్‌లో రోజుకు సగటుగా 8,692 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 3.72 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులు కొనుగోలు చేశారన్నారు. ఇది గత సీజన్ కంటే 92 వేల మెట్రిక్ టన్నులు అధికం అని తుమ్మల పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు తెలిపారు.

యూరియా యాప్ ను ఆదిలాబాద్, మహబూబ్ నగర్, జనగామ, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో డిసెంబర్ 20 నుండి అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఈ ఐదు జిల్లాల్లో 82,059 మంది రైతులు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసి 2,01,789 యూరియా బస్తాలు కొనుగోలు చేశారు. యాప్ ప్రారంభించిన కేవలం 9 రోజుల్లోనే ఈ జిల్లాల్లో రోజుకు 22,000కు పైగా బస్తాలు పంపిణీ అయ్యాయని తుమ్మల వివరించారు.

కపాస్ కిసాన్ యాప్ దిశలో యూరియా యాప్​ తెచ్చాం

ఈ సందర్భంగా యూరియా యాప్ అమలులో ఉన్న జిల్లాల కలెక్టర్లతో మంత్రి మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇప్పటికే కపాస్ కిసాన్ యాప్ (Kapas Kisan App) ద్వారా రైతులు పత్తి అమ్మకాలు సులభంగా చేసుకోగలుగుతున్నారని, అదే దిశలో యూరియా యాప్ ని తీసుకొచ్చినట్లు చెప్పారు. యాప్ అమలులో ఉన్న జిల్లాలతో పాటు అమలులో లేని జిల్లాలలో కాని యూరియా సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.

జిల్లాల వారీగా యూరియా స్టాక్, డిమాండ్, పంపిణీపై జిల్లా కలెక్టర్లు నిశితంగా పర్యవేక్షించాలని, అవసరమైతే అదనపు సేల్స్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యూరియా పంపిణీపై మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించాల్సిందిగా సూచించారు. యూరియా పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించాలని, పర్యవేక్షణలో ఎటువంటి అలసత్వం ఉండకూడదని మంత్రి తుమ్మల ఆదేశించారు.

రాష్ట్రంలో యూరియా లభ్యతపై రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా రైతుల సౌకర్యార్థం వ్యవసాయ కమిషనరేట్ లో టోల్ ఫ్రీ నెం. 18005995779 ఏర్పాటు చేసినట్లు మంత్రి తుమ్మల (Thummala Nageswara Rao) తెలిపారు.

ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, కోఆపరేటీవ్ అడిషనల్ రిజిస్ట్రార్ చంద్రమోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Read Also: సర్పంచ్​ చెక్​ పవర్ పై ప్రభుత్వం కీలక ఆదేశాలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>