కలం, మెదక్ బ్యూరో : సిద్ధిపేట (Siddipet) జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్నానం చేసేందుకు చెక్‌డ్యాంకు వెళ్లి ఇద్దరు బాలురు గల్లంతవగా.. వీరిని కాపాడే ప్రయత్నంలో ఓ బాలుడి తల్లి కూడా గల్లంతైపోయింది. దురదృష్టవశాత్తు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే… సిద్ధిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లిలో నివసించే కిరణ్ కుమార్(12), బిర్జు(6) శనివారం స్నానం చేసేందుకు దగ్గర్లోని చెక్‌డ్యాంకు వెళ్లారు. నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. ఇది గమనించిన బాలుడి తల్లి ఉమాదేవి ఇద్దరినీ రక్షించేందుకు నీటిలోకి దిగింది. ఆమెకు ఈత రాకపోవడంతో నీటిలో గల్లంతైపోయింది. స్థానికులు గమనించి రక్షించేలోగానే ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా బీహార్ నుంచి ఐదు రోజుల క్రితమే ఉపాధి కోసం కస్తూరిపల్లికి వలస వచ్చారు. ఈ ఘటనతో కస్తూరిపల్లిలో విషాదం నెలకొంది.

Read Also: లోపాలు అంగీకరించిన ఎక్స్.. అడల్ట్ కంటెంట్‌పై నిషేధం
Follow Us On : WhatsApp


