కలం, దమ్మ పేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట (Dammapeta) మండలం చెన్నువారిగూడెం గ్రామ శివారులో నాటు తుపాకులతో అడవి జంతువులను వేటాడేందుకు (Illegal Wildlife Hunting) యత్నించిన ముగ్గురు వ్యక్తులను దమ్మపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వన్యప్రాణుల రక్షణే ధ్యేయంగా పోలీసులు చేపట్టిన ఈ తనిఖీల్లో వేటగాళ్ల గుట్టు రట్టయింది. కారం నాగేంద్రబాబు (34), కారం చిట్టిబాబు (27), మోడియం సురేంద్రబాబు (25) అనే ముగ్గురు వ్యక్తులు గత కొంతకాలంగా నాటు తుపాకులతో సమీప అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ మూగజీవాలను బలిగొంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల నుంచి రెండు నాటు తుపాకులు, సుమారు 100 గ్రాముల గన్ పౌడర్, 37 చిన్న ఇనుప గుండ్లతో పాటు ఇతర మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వేట వ్యవహారంలో సంబంధం ఉన్న మరో నిందితుడు పెనుబల్లి శ్రీను ఇప్పటికే దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో కేసులో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
అడవి జంతువులను వేటాడటం, వాటి మాంసాన్ని అక్రమంగా విక్రయించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రజలందరూ పోలీస్, అటవీ శాఖ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడుల్లో అశ్వారావుపేట సీఐ నాగరాజు, దమ్మపేట ఎస్సై రాజేష్ కుమార్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

