ఇరుముడి మూవీ నిర్మాతలకు నోటీసులు

కలం, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ మూవీ (Irumudi Movie) నిర్మాతలకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించారని.. ఇందుకు సంబంధించిన అనుమతులు తీసుకున్నారా.. అని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ పేరిట జారీ అయిన నోటీసుల్లో ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం, బాలిక తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకోవడంతో పాటు జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అదే సమయంలో బాలికతో ఎన్ని రోజులు షూటింగ్ నిర్వహించారు.. కాల్షీట్స్ వివరాలు కూడా సమర్పించాలని సూచించారు. బాలిక షూటింగ్‌లో ఎన్ని గంటలు పాల్గొన్నారు, ఆమె చదువుకు ఏమైనా ఆటంకం కలిగించారా.. షూటింగ్ ప్రదేశాల్లో బాలిక భద్రత, సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఎవరినైనా నియమించారా.. లేదా.. అనేది స్పష్టత ఇవ్వాలన్నారు.

నవంబర్ నాలుగో తేదీ వరకు గడువు..

బాలికకు అందించిన పారితోషికంలో 20 శాతం ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో జమ చేయాల్సి ఉంటుందని.. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాలని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఆదేశించారు. ప్రమోషన్ ఈవెంట్లు, ప్రీ రిలీజ్ వేడుకల్లో బాలిక పాల్గొనేలా చేయడంపై కూడా వివరణ ఇవ్వాలని సూచించారు. నోటీసుల్లో పేర్కొన్న ప్రతి అంశంపై పూర్తి స్థాయిలో సమాధానం ఇస్తూ నవంబర్ నాలుగో తేదీన ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని జాయింట్ కమిషనర్ ఆదేశించారు. జై లోక్ సత్తా సోషల్ జస్టిస్ ఫోరం ఫిర్యాదు మేరకు ఇరుముడి మూవీ నిర్మాతలకు నోటీసులు జారీ అయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>