రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు నిప్పులు

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో పాలనను పూర్తిగా గాలికొదిలేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీలో తిష్టవేశారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఖమ్మం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, తక్కళ్లపల్లి రవీందర్ రావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

90 సార్లు ఢిల్లీకి రేవంత్..

​సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 90 సార్లు ఢిల్లీకి వెళ్లారని, మంత్రులు అక్కడే తిష్ట వేయడంతో రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పూర్తిగా కుంటుపడిందని ఎంపీ వద్దిరాజు మండిపడ్డారు. 34 నెలల కాంగ్రెస్ పాలనలో ఢిల్లీ నుంచి నయా పైసా నిధులు కూడా రాబట్టలేకపోయారని, కేవలం బూటకపు వాగ్దానాలు, అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ ప్రభుత్వం సాధించిందేమీ లేదని దుయ్యబట్టారు.

రేవంత్ సర్కార్ బినామీలకు మియాపూర్ భూములు..

​కేసీఆర్ సుప్రీంకోర్టులో న్యాయవాది వైద్యనాథన్ ద్వారా పోరాడి కాపాడిన మియాపూర్ 550 ఎకరాల భూమిని, తీర్పు రాగానే అమ్మకానికి పెట్టి తమ బినామీలకు కట్టబెట్టాలని రేవంత్ ప్రభుత్వం చూస్తోందని ఎంపీ ఆరోపించారు. భవిష్యత్ తరాల సామాజిక ప్రయోజనాలను దెబ్బతీసేలా విలువైన భూములు అమ్మడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పినా వినకుండా సుమారు 800 టీఎంసీల గోదావరి నీటిని దిగువకు వదిలేసి సీఎం తన గురువు చంద్రబాబుకు గురుదక్షణ చెల్లించుకున్నారని ధ్వజమెత్తారు.

​కరువుపై పాలకుల అశ్రద్ధ..

రాష్ట్రంలో తీవ్ర కరువు కాటకాలు నెలకొన్నా పాలకులకు చీమకుట్టినట్లు కూడా లేదని వద్దిరాజు మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ఈ ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడం తథ్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గుండాల కృష్ణ, రాకేష్ రెడ్డి, ఉప్పల వెంకటరమణ, నరేందర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>