Mobile Popup Ad
Mobile Popup Ad

హైటెక్స్‌లో ‘థ్రెడ్ పోచంపల్లి’ చేనేత ప్రదర్శన.. ప్రారంభించిన మంత్రులు

కలం, యాదాద్రి భువనగిరి: చేనేత కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటుతూ.. వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్థాయి థ్రెడ్ పోచంపల్లి చేనేత (Pochampally Handloom) ప్రదర్శన, విక్రయ కేంద్రం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హైటెక్స్ హాల్ నెంబర్ 4 లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ వైభవ ప్రారంభోత్సవ వేడుకలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతిలతో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్యలు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రదర్శనలోని వివిధ చేనేత స్టాళ్లను సందర్శించి, నేతన్నల నైపుణ్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) మాట్లాడుతూ… భువనగిరి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని చేనేత కుటుంబాల సంక్షేమానికి, వారి సర్వతోముఖాభివృద్ధికి తాము నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. “హైదరాబాద్ నగర ప్రజలు, చేనేత వస్త్ర ప్రియులు జూన్ 5 నుండి జూన్ 7 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిషన్‌ను సందర్శించాలి. ఇక్కడి అద్భుతమైన వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నలకు ఆర్థికంగా అండగా నిలవాలి” అని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో హ్యాండ్లూమ్ చైర్మన్ వెంకరమణ, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశం, వివిధ ప్రజాప్రతినిధులు, చేనేత జౌళి శాఖకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో నేత కార్మికులు పాల్గొన్నారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల వైవిధ్యాన్ని చాటిచెప్పేలా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన మొదటి రోజే సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.

Read Also: హైదరాబాద్‌లో ఎబోలా కలకలం: ‘గాంధీ’లో అనుమానితులు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>