కలం, నల్లగొండ బ్యూరో: తాతల కాలం నాటి ఆస్తులు.. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఇళ్లు.. కష్టపడి సాగు చేసుకుంటున్న భూములు.. ఒకే ఒక్క కలం పోటుతో ఇప్పుడు ‘నిషేధిత జాబితా’లోకి చేరిపోయాయి. యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది కుటుంబాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే రాత్రికి రాత్రే ఆస్తులను (Properties) నిషేధిత జాబితాలో చేర్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రెవెన్యూ అధికారుల నిర్ణయం దుమారం రేపుతోంది. జిల్లావ్యాప్తంగా దాదాపు 39,648 ఇండ్లు, 28,549 ఎకరాల భూములను ప్రభుత్వం చడీచప్పుడు నిషేధిత జాబితాలో చేర్చింది. దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్లు కలిగి ఉండి.. పన్నులు కడుతున్న పేద ప్రజలు ఇప్పుడు తమ ఆస్తులను అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. కనీసం బ్యాంకు రుణాలు సైతం తీసుకోలేని అగమ్యగోచర స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
పరిస్థితి ఇదీ..
యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా పరిధిలో 17 మండలాలు, 6 మున్సిపాలిటీలున్నాయి వీటి పరిధిలో దాదాపు 2 లక్షల ఇండ్లల్లో దాదాపు 8 లక్షల మంది నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల ఏమైందో ఏమోగానీ.. రెవెన్యూ అధికారులు ఉన్నట్టుండీ ఇండ్లు, వ్యవసాయ భూములను నిషేధిత జాబితాలో పెట్టేశారు. జిల్లాలో 39,648 ఇండ్లు, 28,549 ఎకరాలు భూమిని నిషేధిత జాబితాలోకి చేర్చారు. అయితే ఇది అధికారుల నిర్ణయమా..? లేక ప్రభుత్వ నిర్ణయమా.? అన్నది తెలియదు. కానీ ఎవ్వరూ ఊహించనివిధంగా ఇండ్లు, భూములను నిషేధిత జాబితా (పీఓబీ)లో పెట్టడంతో ప్రజలు షాక్ అయ్యారు. అయితే ఇది ఏ ఒక్క మండలానికో.. మున్సిపాలిటీకో పరిమితం కాలేదు. జిల్లా మొత్తం ఇదే పరిస్థితి ఉంది. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమనే చెప్పాలి. ఇదిలాఉంటే.. నిషేధిత జాబితాలో చేర్చిన ఇండ్లు, భూములు తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తున్నాయి. అయితే పాత రికార్డుల్లో (1965 కంటే ముందు) ఈ భూములు ప్రభుత్వ, అసైన్డ్, ఇనామ్ తదితర భూములుగా ఉన్నట్టు తెలుస్తోంది. దాన్ని ఆసరాగా చేసుకుని రెవెన్యూ యంత్రాంగం నిషేధిత జాబితాలో పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ధరణి, భూభారతి రాకముందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పత్రాలు సృషించో.. గ్రామపంచాయతీలో ఇచ్చే ఆస్తి పన్ను ఆధారంగానో.. ఇండ్లు, భూములను గతంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ల ఆధారంగా తర్వాతి తరం విక్రయాలు చేశారు. దీంతో అమ్మినోళ్లు.. అధికారులు బాగానే ఉన్నారు. కానీ కొనుగోలు చేసినోళ్లు కొత్త చిక్కుల్లో పడ్డారని చెప్పాలి.
అగమ్యగోచరంగా సామాన్యుడి పరిస్థితి
ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో అటు ఇండ్లు.. ఇటు సాగు భూములు ఉన్నఫళంగా నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ అత్యవసర అవసరాల కోసమో.. పిల్లల పెళ్లిళ్లకో లేదా అనారోగ్య కారణాల వల్లో ఆస్తులు అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్లు కావడం లేదు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పులు తీసుకునే వెసులుబాటు కూడా లేకుండాపోయింది. నిషేధిత జాబితాలో ఉండటంతో మార్కెట్ ధరలో సగం కూడా రావడం లేదని బాధితులు వాపోతున్నారు. కోర్టు కేసులు లేకపోయినా.. వివాదాలు లేకపోయినా ఎందుకు బ్లాక్ చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ విభాగం మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. నిషేధితా జాబితాలో పెట్టిన ఇండ్లు, భూములు నిజంగా ప్రభుత్వ భూమి అని భావిస్తే.. సంబంధిత యజమానులకు ముందస్తు నోటీసులు ఇచ్చి విచారణ జరపాల్సింది. కానీ కనీస సమాచారం లేకుండా మూకుమ్మడిగా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల పేద ప్రజల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి విచారణ జరిపి అర్హులైనవారి ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సిన అవసరం కచ్చితంగా ఉంది.
Read Also: తెలంగాణ జాతిపితగా గద్దర్.. కంచ ఐలయ్య డిమాండ్
Follow Us On: Instagram

