కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు (Amaravati Bill) ఆమోదం లభించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయి అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమరావతిని రాష్ట్ర ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం ఐదు కోట్ల ఆంధ్రుల సంకల్పానికి, వారి పోరాట పటిమకు నిదర్శనమని ఆయన కొనియాడారు. గత ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల వల్ల రాష్ట్ర భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితికి ఈ బిల్లుతో తెరపడిందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీయే (NDA) ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఈ చారిత్రక సందర్భంలో అమరావతి కోసం 33 వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులను పవన్ ప్రశంసించారు. వారి త్యాగం తరతరాల వరకు గుర్తుండిపోతుందని భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే, అమరావతికి పునాది వేసిన సీఎం చంద్రబాబు దార్శనికతను, ఈ విజన్‌ను సాకారం చేయడంలో నిరంతరం సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్లలో రైతులు, మహిళలు, యువత పడిన ఆవేదనను ఈ నిర్ణయం రూపుమాపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతి బిల్లు ఆమోదంతో అటు ప్రజల్లోనూ, ఇటు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లోనూ కొత్త భరోసా కల్పించినట్లయిందని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. అమరావతి కేవలం ఒక రాజధాని నగరం మాత్రమే కాదని, అది ఆంధ్రుల ఆశలకు, ధైర్యానికి, సమష్టి కృత నిశ్చయానికి చిహ్నమని ఆయన అభివర్ణించారు. ప్రధాని మోడీ ఆశయమైన ‘వికసిత్ భారత్ 2047’ దిశగా సాగే ప్రయాణంలో అమరావతి కీలక పాత్ర పోషిస్తుందని, ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది బలమైన పునాదిగా నిలుస్తుందని ఆయన తన పోస్ట్‌లో ధీమా వ్యక్తం చేశారు.
Read Also: జనసేన ఆఫీస్ ముందు కాపు నేతల ఆందోళన.. ఎందుకంటే?
Follow Us On: Facebook

