కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాలం తెచ్చిన కరువు కాదని, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువే అని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఆరోపించారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి కళాశాల, వాసవి డిగ్రీ కళాశాలల్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్న నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా రేవంత్ సర్కార్ యువతను మోసం చేసిందన్నారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు అత్యంత బాధ్యతగా తీసుకుని అర్హులందరినీ ఓటరుగా నమోదు అయ్యే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఓటరు నమోదు కేంద్రాలను పట్టభద్రులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన కోరారు. రైతుల బోర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేసినా కేసీఆర్ అంగీకరించలేదన్నారు. పంటలు ఎండిపోకుండా 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, బీఆర్ఎస్వీ నాయకులు శివకుమార్, నవీన్ రాజ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

