కలం, జగిత్యాల : కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టడంతో పాటు శాశ్వత వైకల్యాలను నివారించవచ్చని లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ (ఎల్సీడీసీ) రాష్ట్ర అబ్జర్వర్ డాక్టర్ రాజు తెలిపారు. ప్రజల్లో వ్యాధిపై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేకు (Door-to-Door Survey) ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
శుక్రవారం జగిత్యాల జిల్లా కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దరూర్ సబ్ సెంటర్‌ను డాక్టర్ రాజు సందర్శించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్‌తో కలిసి క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న ఎల్సీడీసీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నిర్వహిస్తున్న సర్వే విధానం, సేకరిస్తున్న వివరాలను తనిఖీ చేసి, గుర్తించిన కుష్ఠు వ్యాధి అనుమానిత కేసుల గురించి ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుష్ఠు వ్యాధి పూర్తిగా నయం చేయగలిగిన వ్యాధి అని, దీనిపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. శరీరంపై స్పర్శ లేని మచ్చలు, తిమ్మిర్లు, బుడిపెలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. అక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటు అవసరమైన మందులను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.
చికిత్సలో ఆలస్యం చేస్తే నరాలు దెబ్బతిని చేతులు, కాళ్లకు వైకల్యం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి లక్షణాలను దాచిపెట్టకుండా ముందుగానే వైద్యులను సంప్రదించాలని, ఆశా కార్యకర్తల ఇంటింటి సర్వేకు ప్రజలు సహకరించాలని డాక్టర్ రాజు విజ్ఞప్తి చేశారు.

