కలం, బోనకల్: ఖమ్మం (Khammam) జిల్లా బోనకల్ మండలం రామాపురం (Ramapuram) గ్రామ పంచాయితీ కార్యాలయంలో శుక్రవారం ఎల్ నినో ప్రభావంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోనకల్ ఎంపీడీవో రమాదేవి, బోనకల్ మండల వ్యవసాయ అధికారి పి. వినయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటడం, నీటి కొరత ఏర్పడటం దృష్ట్యా రైతులు రాబోయే సీజన్ లో వరి సాగును మానుకొని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని బోనకల్ మండల వ్యవసాయాధికారి పి. వినయ్ సూచించారు. రైతులు తక్కువ నీటితో పండే పెసర, మినుము, జొన్న, సజ్జ, రాగులు వంటి పంటలు, అపరాల పంటలు వేయడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చని చెప్పారు.
నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని, మార్కెట్ లో మంచి ధర లభిస్తుందని వ్యవసాయాధికారి వివరించారు. ఒక ఎకరం వరి పంటకు 30-35 తడులు నీరు అవసరమని, మొక్కజొన్నకు 6-8 తడులు అవసరమని తెలిపారు. తీవ్ర నీటి కొరత ఉన్న సమయంలో వరి వేయడం వల్ల బోర్లు అడుగంటి పోతాయని చెప్పారు. దానికి బదులుగా పెసర, మినుము, జొన్న, సజ్జ, రాగి వంటి చిరుధాన్యాలు వేస్తే 1-2 తడులతోనే పంట చేతికి వస్తుందన్నారు.
తక్కువ పెట్టుబడి, తక్కువ నీరు, ఎక్కువ లాభం ఉంటుందని చెప్పారు. నీటిని ఆదా చేస్తేనే రాబోయే కాలంలో బోర్లు బ్రతుకుతాయని రైతులకు సూచించారు. అలాగే రైతులకు MGG-385, MGG-295 పెసర విత్తనాలు 50శాతం సబ్సిడీ ద్వారా అందిస్తున్నామని.. ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

