కలం, కరీంనగర్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను గోస పెడుతున్న రేవంత్ రెడ్డి ఇక ప్రభుత్వానికి మనుగడ లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి (Nageshwar Reddy) మండిపడ్డారు. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఘాటుగా విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాదులో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల బీజేపీ నేతలు పాల్గొన్నారు.
చలో అసెంబ్లీ ప్రోగ్రామ్ సందర్భంగా అసెంబ్లీ వైపు తల్లి వెళ్ళిన తిమ్మాపూర్ బీజేపీ నాయకులు కార్యకర్తలను అరెస్టు చేసి అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అక్రమ అరెస్ట్ లపై రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ చెల్లించకుండా వారి భవిష్యత్తు తో చెలగాటం పడుతుందని మండిపడ్డారు.
విద్యార్థులు పై చదువు లేక పోతున్నారని, కొంతమంది విద్యార్థులు ఆత్మ హత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని.. లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సంజీవ రెడ్డి, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివెద మహిపాల్ రెడ్డి, తిమ్మాపూర్ మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్, మండల కిసాన్ మోర్చా కార్యదర్శులు మధుకర్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

