కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న జీఓ నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ AISF ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం రాహుల్ గాంధీకి పోస్ట్‌కార్డుల ద్వారా వినతిపత్రాలు పంపారు. కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా AISF జిల్లా సహాయ కార్యదర్శి మనిక్యాల విజయ్ మాట్లాడుతూ, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET)ను ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేయడం వల్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్య కార్పొరేటీకరణ వైపు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన సాంకేతిక విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు.
పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల్లో ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జీఓ 97ను రద్దు చేసి న్యాయం చేయాలని రాహుల్ గాంధీని కోరారు. ముఖ్యంగా సింగరేణి వంటి ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో ‘సబ్ ఇంజనీర్’ పోస్టులకు డిప్లొమా విద్యార్థులకు ఉన్న అర్హతలను, ప్రాధాన్యతను పరిరక్షించాలని స్పష్టం చేశారు. ఈ పోస్ట్‌కార్డుల వినతి కార్యక్రమంలో AISF జిల్లా ఉపాధ్యక్షుడు కొరిమి సంజయ్, పాలిటెక్నిక్ కమిటీ సభ్యులు విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

