కలం, మధిర: ఖమ్మం (Khammam) జిల్లా మధిర మండలం మాటూరు (Matoor) గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో జరుగుతున్న వరుస చోరీలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాగునీటి కోసం పొలాల వద్ద అమర్చిన విద్యుత్ మోటర్ల వైర్లను గుర్తుతెలియని దుండగులు కట్ చేసి ఎత్తుకెళ్లడమే కాకుండా, మోటర్లకు సంబంధించిన పైపులను సైతం అపహరిస్తుండటంతో అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది.
ఇప్పటికే ఎల్నినో (El Nino) ప్రభావంతో సకాలంలో వర్షాలు లేక, పంటల సాగు ఎలాగో అని సతమతమవుతున్న రైతులకు ఈ దొంగతనాలు గోరుచుట్టుపై రోకలిపోటులా మారాయి. కొత్తగా వైర్లు, పైపులు కొనుగోలు చేయాలంటే వేల రూపాయలు ఖర్చవుతుండటంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు.
రైతుల కష్టాలను గుర్తించి పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని మాటూరు గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాల వద్ద రాత్రి వేళల్లో ప్రత్యేకంగా నైట్ బీట్ (గస్తీ) నిర్వహించాలని, దొంగలను పట్టుకుని భవిష్యత్తులో ఇలాంటి చోరీలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read : సైనికులపై హనీ ట్రాప్.. ఎయిర్ ఫోర్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

