నీటి సమస్య తీరకుంటే మున్సిపల్ కార్యాలయం ముట్టడి: సీపీఎం

కలం, నిజామాబాద్ బ్యూరో: నాగారం 50 క్వార్టర్స్‌లోని రాజీవ్ గృహకల్ప అపార్ట్‌మెంట్లలో నెలకొన్న మంచినీటి సమస్యను (Drinking Water Problem) వెంటనే పరిష్కరించాలని సీపీఎం (CPM) ఆధ్వర్యంలో స్థానిక నివాసితులు మున్సిపల్ కమిషనర్‌కు (Municipal Commissioner)వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత మాట్లాడుతూ.. అపార్ట్‌మెంట్లకు నీటిని సరఫరా చేసే బోరు మోటార్ ఆరు నెలల క్రితం మరమ్మతులకు గురైందని, ఇప్పటివరకు దానిని బాగు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

మోటార్ మరమ్మతుల పేరుతో కమిటీ సభ్యులమని చెప్పుకుంటున్న కొందరు ప్రతి కుటుంబం నుంచి రూ.500 చొప్పున వసూలు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. కొందరు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు నీటిని వినియోగించుకుంటూ, మిగతా కుటుంబాలకు వారానికి ఒక్కరోజు మాత్రమే నీరు అందేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై ప్రశ్నించిన వారిని బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి బోరు మోటార్‌ను మరమ్మతు చేయడంతో పాటు నీటి సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి, కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేణుక, లలిత, గంగాధర్, శ్రీదేవి, జుబేర్, శివ, సురేష్, బాబురావు, మంజుల, పుష్ప, పటాన్ ఫారుక్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>