అర్హులందరికీ చేయూత పెన్షన్లు అందజేయాలి: ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కలం, కరీంనగర్: అర్హులైన ప్రతి పేదవాడికి చేయూత పెన్షన్లు (Cheyutha Pension) అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలవాలని, పేదలకు అండగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గ్రామాల్లో వంద మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం పది మందికే పెన్షన్లు మంజూరయ్యేవని, మిగతా 90 మంది తమకు పెన్షన్ రావాలంటే లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోవాలని ఎదురుచూసే దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. టీడీపీ హయాం నుంచి పెన్షన్ల‌ కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను తాను ప్రత్యక్షంగా చూశామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ (KCR) నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్లను రూ.200 నుంచి రూ.2,000కు పెంచి పేదలకు అండగా నిలిచిందని తెలిపారు. గ్రామంలో ఎంతమంది అర్హులుంటే అంతమందికీ పెన్షన్లు అందించాలనే లక్ష్యంతో ఆనాడు ప్రభుత్వం పని చేసిందన్నారు.

ప్రభుత్వాలు మారుతుంటాయని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గతంలో కొత్తపల్లి మండలంలో 2,327 పెన్షన్లు ఉండగా.. తాజాగా మరో 354 కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా పెన్షన్లు పొందిన అర్హులకు అభినందనలు తెలిపారు.

అయితే ఇంకా అనేక గ్రామాల్లో పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలు ఉన్నారని, చిన్నచిన్న సాంకేతిక కారణాలతో, రేషన్ కార్డుల నిబంధనలతో కొందరికి పెన్షన్లు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారందరినీ గుర్తించి పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల్లో నిర్వహించే గ్రామసభల్లో పెన్షన్లు అందని అర్హుల వివరాలను సేకరించి, వారి తరఫున ప్రభుత్వంతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు.

పెన్షన్ డబ్బులే ఆధారంగా ఎన్నో పేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని.. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ ఎంతో ఆసరాగా ఉంటుందని పేర్కొన్నారు.గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, గ్రామాల్లో పక్షపాతానికి తావులేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్ అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులకు ఎమ్మెల్యే (Gangula Kamalakar) శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకుల నరసన్న, కరీంనగర్ ఫాక్స్ ఛైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీడీఓ అశోక్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>