కలం, వెబ్ డెస్క్: దేశమంతా ఇప్పుడు ఇండిగో సంక్షోభం (Indigo Crisis) గురించే మాట్లాడుకుంటోంది. ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఫ్లైట్ క్రైసిస్ ఇది. వేల సర్వీసులు రద్దయ్యాయి. లక్షల మంది ఎయిర్ పోర్టుల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంక్షోభానికి కారణం కేవలం DGCA కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ నిబంధనలు మాత్రమే కాదు… ఇండిగో సొంత స్వార్థ నిర్ణయాలు కూడా దీన్ని ఈ స్థాయికి తెచ్చి పెట్టాయన్నది నెట్టింట్లో హాట్ డిబేట్. గతంలో ఉన్న రూల్స్ ప్రకారం తక్కువ సిబ్బందితో ఫ్లైట్లు నడిపి భారీ లాభాలు రాబట్టిన ఇండిగో… కొత్త రూల్స్ రాబోతున్నాయని ముందే తెలిసినా సరిపడా పైలట్లు, క్రూ మెంబర్లను రిక్రూట్ చేసుకోలేదు.. కొత్త రూల్స్ కి అనుగుణంగా మ్యాన్ పవర్ పెంచుకోకుండా ఫ్లైట్స్ ను రన్ చేయడం ఇండిగో స్వార్ధానికి అద్దంలాంటిదని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. ఇండిగో సంక్షోభంపై నెట్టింట్లో జరుగుతున్న ఆసక్తికర డిబేట్ ఇలా ఉంది.
కొత్త రూల్స్ అమలులోకి వచ్చే సమయానికి పైలట్స్ సరిపోరని తెలిసినా సరే.. ఇండిగో ముందే రిక్రూట్మెంట్స్ చేసుకోలేదు. కొత్త రూల్స్ ను అంచనా వేయడంలో, ప్లానింగ్ చేయడంలో దారుణంగా ఫెయిల్ అయింది. అందులోనూ.. ఇండిగో అర్ధరాత్రి సమయంలోనే ఎక్కువ ఫ్లైట్లు నడుపుతోంది. వేరే దేశాల టైమింగ్స్ ను బట్టి పోటీ లేకుండా అర్ధరాత్రి ఎక్కువగా నడిపితే లాభాలు ఆ స్థాయిలోనే వస్తున్నాయి. ఇండిగో అవలంభించే ఆ వ్యూహమే ఇప్పుడు ఆ సంస్థ కొంప ముంచింది. ఎందుకంటే DGCA కొత్త రూల్స్ ప్రకారం రాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 6 గంటల మధ్య రెండు ల్యాండింగ్స్ మాత్రమే చేయాలి. ఇంతకు ముందు ఇది 6 ల్యాండింగ్స్ గా ఉండేది.
ఇండిగో కొత్త నిబంధనలని సీరియస్ గా తీసుకోకుండా పాత షెడ్యూల్ తోనే నెలల తరబడి బుకింగ్స్ తెరిచి పెట్టారు. ఇప్పుడు ఆ ఫ్లైట్లు నడవడం అసాధ్యం, ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో గంటల తరబడి ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఒక్కో ఫ్లైట్ ను ఇండిగో రోజుకు 10 గంటల కంటే ఎక్కువ నడిపిస్తూ వస్తోంది. కొత్త రూల్ ప్రకారం పైలెట్ 10 గంటల కంటే ఎక్కువ ఫ్లైట్ ను నడపడం నిషేధం. ఇక ఈ మూడు పెను తప్పిదాలు… సమయానికి సిబ్బందిని పెంచుకోకపోవడం, రాత్రి ఫ్లైట్లపై ఎక్కువగా ఆధారపడటం, పాత షెడ్యూల్‌తో బుకింగ్స్ తెరవడం… వెరసి విమానయాన చరిత్రలోనే ఇండిగో అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడైనా ఇండిగో త్వరగా సిబ్బందిని పెంచి, షెడ్యూల్ ను కొత్తగా రూపొందిస్తుందా అన్నదే లక్షల మంది ప్రయాణికులు ఆశతో ఎదురుచూస్తున్న ప్రశ్న.


