epaper
Monday, February 23, 2026
epaper

గ్రామీణ నేప‌థ్యం నుంచి.. ఇంట‌ర్నేష‌న‌ల్ డ్ర‌గ్ డాన్‌..!

క‌లం, వెబ్ డెస్క్‌: ఎల్ మెంచో (El Mencho).. ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం మారుమోగుతున్న పేరు ఇది.. మెక్సికో బ‌ల‌గాలు ఈ డ్ర‌గ్ మాఫియా లీడ‌ర్‌ను హ‌త‌మార్చాయి. దీంతో మెక్సికో వ్యాప్తంగా అత‌డి అనుచ‌రుల నిర‌స‌న‌లు తారా స్థాయికి చేరుకున్నాయి. రోడ్ల‌పై మెంచో అనుచ‌రులు చేస్తున్న విధ్వంసాల‌తో భ‌యాందోళ‌న నెల‌కొంది. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీంతో ఈ డ్ర‌గ్ డాన్ గురించి తెలుసుకునేందుకు నెటిజ‌న్లు సెర్చ్ చేస్తున్నారు. అస‌లు ఎవ‌రీ ఎల్ మెంచో? ఆయ‌న మృతి ఎందుకింత న్యూస్ క్రియేట్ చేసింది.. మీరూ తెలుసుకోండి.

ఎల్ మెంచో అస‌లు పేరు నెమేసియో రూబెన్ ఒసెగుయేరా సెర్వాంటెస్. ఈయ‌న‌ మెక్సికోలోని మిచోకాన్ రాష్ట్రంలో ఉన్న ఓ సాధారణ గ్రామంలో జ‌న్మించాడు. పేద కుటుంబంలో జన్మించిన ఎల్ మెంచో చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని కాల‌క్ర‌మేణా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేర సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అతని నేతృత్వంలోని జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ ప‌దిహేనేళ్ల క్రితం ఒక చిన్న గ్రూపుగా మొదలై కొద్దిరోజుల‌కే మెక్సికోలోని అనేక రాష్ట్రాల్లో విస్తరించింది. కాల‌క్ర‌మేణా అంతర్జాతీయ స్థాయిలో 40కి పైగా దేశాల్లో విస్త‌రించి త‌న కార్య‌క‌లాపాలు ప్రారంభించింది. ఎల్ మెంచో ఇలా త‌న నేర సామ్రాజ్య విస్త‌ర‌ణ‌లో ఎన్నో దుర్మార్గాల‌కు పాల్ప‌డ్డాడు. ప‌లు హింసాత్మక యుద్ధాలు, స్ట్రాటజిక్ అలయన్స్‌లు కూడా చేశాడు.

ఎల్ మెంచో 1980లో అమెరికాకు అక్రమంగా వలస వెళ్లాడు. అక్క‌డ గంజాయి సాగు చేయ‌డంతో పాటు డ్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణాలో భాగ‌మ‌య్యాడు. 1990లో అమెరికాలో ఓ డ్ర‌గ్ కేసులో అరెస్ట్ అయి మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి మెక్సికోకు డిపోర్ట్ అయ్యాడు. మెక్సికోకు తిరిగొచ్చిన తర్వాత స్థానిక పోలీస్ విభాగంలో పని చేశాడు. చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలో మంచి అనుభవాన్ని సంపాదించాడు. ఆ త‌ర్వాత‌ సినలోవా కార్టెల్ అనుబంధమైన మిలెనియో కార్టెల్‌లో చేరి తన నేర ప్ర‌యాణాన్ని ముందుకు తీసుకెళ్లాడు.

2009లో మిలెనియో కార్టెల్ లీడర్ నాచో కోరోనెల్ మరణం తర్వాత మిలెనియో కార్టెల్ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఇందులో ఒక గ్రూప్ లా రెసిస్టెన్సియాగా, మ‌రో గ్రూప్ సీజేఎన్‌జీగా ఏర్ప‌డింది. కొద్ది రోజుల‌కు ఎల్ మెంచో నేతృత్వంలోని సీజేఎన్‌జీ, లా రెసిస్టెన్సియాను ఓడించి మిలెనియో స్మగ్లింగ్ నెట్‌వర్క్స్‌ను తన ఆధీనంలోకి తీసుకుంది. 2012 నాటికి సీజేఎన్‌జీ మెక్సికోలోని తూర్పు నుంచి పశ్చిమ తీరం వరకు తన ఆపరేషన్లను విస్తరించి అత్యంత సామర్థ్యవంతమైన నేర గ్రూపుల్లో ఒకటిగా మారింది. జాలిస్కో, కోలిమా, నయారిట్ రాష్ట్రాల్లో బలమైన స్థావ‌రాలు ఏర్పాటు చేసుకొని, మిచోకాన్‌లో నైట్స్ టెంప్లర్ కార్టెల్‌తో యుద్ధాలు చేసింది.

సీజేఎన్‌జీ తన విస్తరణలో జెటాస్, నైట్స్ టెంప్లర్ వంటి ప్రత్యర్థి గ్రూపులతో భారీ యుద్ధాలు చేసింది. రాజ‌కీయాల్లో ఇది కీల‌క పాత్ర పోషించింది. మిచోకాన్‌లో సెల్ఫ్ డిఫెన్స్ గ్రూపులకు మద్దతిచ్చి, ప్రత్యర్థులను బలహీనపరిచింది. 2015 నుంచి సీజేఎన్‌జీ ‘ఆర్ఫన్’ క్రిమినల్ సెల్స్‌ను ద‌త్త‌త తీసుకొని, మెక్సికోలోని 27 రాష్ట్రాల్లో తన ఉనికిని చాటుకుంది. గ్వానాజువాటో, వెరాక్రూజ్, మోరెలోస్, గ్వెర్రెరో వంటి రాష్ట్రాల్లో డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, ఎక్స్టార్షన్, ఫ్యూయల్ థెఫ్ట్ వంటి నేరాల‌కు పాల్ప‌డింది. ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా చిన్న స్థానిక కార్టెల్‌లతో అలయన్స్‌లు ఏర్పరచుకొని వేగంగా వృద్ధి చెందింది.

సీజేఎన్‌జీ ప్రధానంగా ఫెంటానిల్, మెథాంఫెటమైన్, కోకైన్ వంటి మాదక ద్రవ్యాల ఉత్పత్తి, ర‌వాణాలో కీల‌క పాత్ర పోషిస్తుంది. 2000 సంవ‌త్స‌రంలో అంతర్జాతీయ స్థాయిలో కోకైన్, మెథ్ ఆపరేషన్లు మొదలుపెట్టిన ఎల్ మెంచో, 2018 నాటికి సినలోవా కార్టెల్‌తో పోటీగా మారాడు. ప్రస్తుతం సీజేఎన్‌జీ 40కి పైగా దేశాల్లో త‌న కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తోంది. ఇది అమెరికాలో ఫెంటానిల్ క్రైసిస్‌కు కారణమవుతుంది. ఎల్ మెంచోపై అమెరికా ప్రభుత్వం భారీ బహుమతి ప్రకటించింది. ప్రపంచంలోనే మోస్ట్‌ వాంటెడ్ నేరస్థుల జాబితాలో అత‌డి పేరును చేర్చింది. ఎల్ మెంచో ఆచూకీ చెపితే 10 మిలియన్ డాలర్లు న‌గ‌దు బ‌హుమ‌తి ఇస్తామ‌ని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర డ్ర‌గ్ ముఠా నేతల్లో ఒకరిగా అతడిని గుర్తించిన అమెరికా అధికారులు అంతర్జాతీయ స్థాయిలో అత‌డి కోసం గాలించారు. ఎల్ మెంచో కుటుంబసభ్యులు, ముఖ్యంగా అతని కుమారుడు ఎల్ మెంచిటో సీజేఎన్‌జీలో కీలక పాత్రలు పోషించారు. ఎల్ మెంచో మరణం తర్వాత సీజేఎన్‌జీలో అంతర్గత ఆధిప‌త్య‌ పోరాటాలు జరిగే అవకాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. సీజేఎన్‌జీ విస్తరణ వ్యూహాలు మెక్సికో డ్రగ్ వార్‌లో పెను మార్పులు తీసుకురావచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>