బాణం vs బస్సు.. ఆర్టీసీ ‘బిగ్ ఫైట్’!

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఆర్టీసీ (TGSRTC)లో పదేండ్ల తర్వాత కార్మికుల ఓటుకు టైమ్ వచ్చింది. తమ సమస్యలపై యాజమాన్యంతో చర్చించబోయే గుర్తింపు సంఘాలను ఎన్నుకునేందుకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. పూర్తిగా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల ద్వారా రాష్ట్ర, రీజినల్ స్థాయి గుర్తింపు కార్మిక సంఘాలు ఎన్నిక కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సు డిపోల్లో ఉదయం 5.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

పోలింగ్‌కు హాజరుకాలేని వర్కర్ల కోసం ఈ నెల 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ జరగనున్నది. ఈ నెల 17న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 12 కార్మిక సంఘాలు బరిలో ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ తెలంగాణ వర్కర్స్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ మధ్యనే నెలకొన్నది. ఈ రెండూ వేర్వేరు ప్యానెళ్లుగా పోటీ చేస్తున్నాయి. మరికొన్ని సంఘాలు వీటితో సంబంధం లేకుండా విడిగానే బరిలో ఉన్నాయి.

ఒక ప్యానెల్కు కాంగ్రెస్, సీపీఎం మద్దతు

తెలంగాణ వర్కర్స్ యూనియన్ (TWU)కు కాంగ్రెస్, సీపీఎం మద్దతు పలుకుతున్నాయి. సీపీఎం అనుబంధ కార్మిక సంఘం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్తో పాటు స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కూడా మద్దతు పలుకుతున్నది. మరోవైపు ఎంప్లాయీస్ యూనియన్ ప్యానెల్కు తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ మద్దతు పలుకుతున్నాయి. రెండు బలమైన యూనియన్లు రెండు వేర్వేరు ప్యానెళ్లుగా పోటీ చేస్తుండడంతో ప్రధాన పోటీ వీటి మధ్యనే జరుగుతున్నది.

ఇవి కాక కార్మిక యూనియన్, తెలంగాణ నేషనల్ మజ్దూర్ యూనియన్, బహుజన వర్కర్స్ యూనియన్, బహుజన కార్మిక యూనియన్, కార్మిక్ సంఘ్, కార్మిక పరిషత్ తదితర యూనియన్లు కూడా పోటీలో ఉన్నాయి. 2016 ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్కు అప్పటి అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ మద్దతు పలికింది. ఈసారి సైలెంట్గానే ఉన్నది. తెలంగాణ వర్కర్స్ యూనియన్ నాయకుడు మొగుళ్ల రాజిరెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు వెంకన్న మధ్యనే కీలక పోటీ ఉంటుందన్నది కార్మికుల వాదన.

ప్రధాన హామీలివే..

పీఆర్సీ ఫిట్మెంట్, డీఏల చెల్లింపు, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, ప్రమోషన్లు, ఖాళీ పోస్టుల భర్తీ, కారుణ్య నియామకాలు, పని ఒత్తిడి తగ్గించేలా డ్యూటీ ఛార్ట్ సవరణ, డ్యూటీ టైమింగ్స్తో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి హామీలను యూనియన్లు కార్మికుల ముందు పెట్టాయి. పదేండ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లుగా ఉన్న ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది తలా రెండు ఓట్లు వేయనున్నారు.

ఒకటి రాష్ట్రస్థాయి, మరొకటి రీజినల్ స్థాయి గుర్తింపు సంఘం కోసం. రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘంగా గెలిచేందుకు వివిధ రీజియన్లలో ఆధిపత్యం సాధించడంపై సంఘాలు దృష్టి పెట్టాయి. టీడబ్ల్యూయూ బాణం గుర్తుతో, ఎంప్లాయీస్ యూనియన్ బస్సు గుర్తుతో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 97 బస్సు డిపోలతో పాటు వర్క్షాప్‌లు, బస్ స్టేషన్లు, రీజినల్ హెడ్క్వార్టర్స్, హెడ్ ఆఫీస్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర కార్మిక శాఖ ఈ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నది.

ఆర్టీసీ ఎన్నికల ముఖచిత్రం :

అక్టోబరు 9న: పోలింగ్
14, 15న : పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
17న: ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
మొత్తం కార్మికులు: సుమారు 36,300 మంది
పోలింగ్ కేంద్రాలు: అన్ని బస్సు డిపోల్లో (97)
పోలింగ్ టైమ్ : ఉదయం 5 నుంచి సాయంత్రం 6 వరకు
బరిలో ఉన్న యూనియన్లు : 12

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>