కలం, వరంగల్ బ్యూరో : మేడారం మహా జాతర (Medaram Maha Jatara ) ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడుతోంది. జాతరకు కోట్లాది సంఖ్యలో భక్తులు తరలివచ్చే క్రమంలో జాతర విజయవంతం అవడంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తుంది. బస్సుల్లో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ (TGSRTC) కీలకంగా పనిచేస్తుంది. గత జాతరలో 20 లక్షల మందికి పైగా భక్తులు ఆర్టీసీ ద్వారా మేడారం జాతరకు వచ్చి వెళ్లారు. ఈసారి కూడా జాతర కు వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు తగు ఏర్పాట్లు చేపట్టారు.
జాతరకు 4 వేల బస్సులు
గత అనుభవాల దృష్ట్యా ఈ సారి మేడారం జాతరకు 30 లక్షల మందిని తరలించే లక్ష్యంతో ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే హనుమకొండ, వరంగల్ నుండి మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులు ప్రారంభం కాగా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల నుండి బస్సులు నడపడానికి ఆర్టీసీ సన్నద్ధమైంది. మొత్తం మేడారం మహా జాతరకు నాలుగు వేల బస్సులను నడపనున్నారు. గత జాతరలో 3,500 బస్సులను నడపగా, ఈసారి నాలుగు వేల బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.
మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీ
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం తో ఈ సారి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కంటే ఈ జాతరకు అదనంగా 500 బస్సులను చేర్చి నడిపేందుకుదుకు చర్యలు చేపట్టింది. ఈ బస్సులను కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం రీజియన్లలోని 51 పాయింట్స్ నుంచి నడుపనున్నారు. ఈనెల 25 నుంచి పూర్తిస్థాయిలో బస్సు సర్వీసులను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
14 వేల ఆర్టీసీ సిబ్బంది
మేడారం జాతరకు (Medaram Maha Jatara) 14వేల మంది ఆర్టీసీ సిబ్బంది వినియోగించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 4.35 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో మేడారంలో తాత్కాలిక బస్టాండ్, బస, క్యూలైన్లు, టికెట్ కౌంటర్లు, పార్కింగ్ స్థలాలు, క్యాంటిన్లు, సిబ్బంది వసతి, తాగునీరు వంటి సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. మొత్తం 14వేల మంది ఆర్టీసీ సిబ్బంది మేడారం జాతరకు వచ్చే భక్తులకు సేవలను అందించనున్నారు. హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు ఉంటాయి కానీ ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం మాత్రం అందుబాటులో లేదు.
50 ఎకరాల్లో ఏర్పాట్లు
మేడారం మహా జాతరకు ఆర్టీసీ 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేపట్టింది. 20 ఎకరాలలో తాత్కాలిక బస్టాండ్ ను నిర్మిస్తున్నారు. 20 ఎకరాలు పార్కింగ్ కోసం, తాడ్వాయి వద్ద టికెట్లు జారీకి అదనంగా ఆరు ఎకరాలు కేటాయించారు. ఒకవేళ ట్రాఫిక్ పెరిగితే కామారం ప్రాంతంలో మరో 15 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేసి ఉంచారు. ఈనెల 23న ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. మేడారం ప్రయాణ ప్రాంగణంలో 52 క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు.
మేడారం జాతరకు 15 మొబైల్ బృందాలు…
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 25 తాత్కాలిక ప్రయాణ ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారు. బస్సులు మొరాయిస్తే వాటి మరమ్మతులకు మేడారం, తాడ్వాయి, పస్రా, గట్టమ్మ వద్ద మూడు చోట్ల నాలుగు క్యాంపుల్లో మెకానిక్ లు అందుబాటులో ఉంటారు. మేడారం జాతరకు అదనంగా 15 మొబైల్ బృందాలు పనిచేయనున్నాయి. ఒక బృందంలో మెకానిక్ ఎలక్ట్రీషియన్ ఇద్దరు సిబ్బంది ఉంటారు. వీరంతా బస్సుల స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఎక్కడైనా బస్సులు ఆగిపోతే వాటిని తరలించడానికి రెండు క్రేన్లు, ఐదు ట్రాక్టర్లను సిద్ధం చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు సుఖవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించడానికి కృషి చేస్తున్నట్లు వరంగల్ ఆర్ఎండి విజయభాను తెలిపారు.
Read Also: ఎర్రవెల్లిలో కేసీఆర్ కుటుంబం సంక్రాంతి సంబురాలు
Follow Us On: Sharechat


