కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (TGO) రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు (TGO State President Eluru Srinivas Rao) కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. పంట వ్యర్థాలను తగలబెడుతున్న క్రమంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టు ఒక్కసారిగా కూలిపోవడంతో కారులో వస్తున్న కుటుంబ సభ్యులపై ఆ భారీ వృక్షం పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం ఖమ్మం (Khammam) జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామం వద్ద వైరా-మధిర రహదారిపై చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు (Eluru Srinivas Rao) తన కుటుంబ సభ్యులతో కలిసి రెండు కార్లలో వైరా నుండి మధిర వైపు వెళ్తున్నారు. గొల్లపూడి గ్రామం వద్ద కొందరు రైతులు రోడ్డు పక్కన పంట వ్యర్థాలను తగలబెట్టగా, ఆ మంటలు పక్కనే ఉన్న ఒక భారీ వృక్షానికి అంటుకున్నాయి. శ్రీనివాసరావు ప్రయాణిస్తున్న కారు ఆ ప్రాంతాన్ని దాటిన మరుక్షణమే, మంటల తీవ్రతకు కాలిపోయిన ఆ భారీ వృక్షం ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలింది. దాంతో ఆయన వెనుకనే వస్తున్న కుటుంబ సభ్యుల కారుపై ఆ చెట్టు పడటంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఏలూరు శ్రీనివాసరావు, స్థానికుల సహాయంతో కారులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం వారిని మరో వాహనంలో తక్షణమే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొందరు రైతులు బాధ్యతారహితంగా రోడ్డు పక్కనే పంట వ్యర్థాలను తగలబెడుతుండటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల రహదారులపై ప్రయాణించాలంటేనే భయభ్రాంతులకు గురికావాల్సి వస్తోందని వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: సీఎం పదవికి రాజీనామా.. సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
Read Also: పిల్లల్ని కనడం లేదు

