Mobile Popup Ad
Mobile Popup Ad

వనపర్తిలో వరి కొనుగోలు ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేసి వచ్చే 15 రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) తెలిపారు. గురువారం వనపర్తి మండలం చిట్యాల శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో(Chityal Market Yard) ధాన్యం నిల్వ కోసం అదనంగా ఏర్పాటు చేసిన గోదామును అదనపు కలెక్టర్ వినోద్ కుమార్‌‌తో కలిసి కలెక్టర్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Adarsh Surabhi) మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు పూర్తి భరోసా ఇస్తోందని చెప్పారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో వర్షాల కారణంగా తడిసిన 600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్ మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. జిల్లాలో గత రెండేళ్లుగా రికార్డు స్థాయిలో వరి దిగుబడులు వస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. గతంలో ఒక్క సీజన్‌కు సుమారు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చేదని, ప్రస్తుతం అది 2.50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పెరిగిందని చెప్పారు. అధిక దిగుబడుల కారణంగా గోదాములలో స్థల కొరత ఏర్పడుతోందని అన్నారు.

ఈసారి వరి కోతలు ఆలస్యంగా ప్రారంభం కావడం, బీహార్ నుంచి వచ్చే హమాలీల కొరత కూడా కొనుగోళ్ల ప్రక్రియ నెమ్మదించడానికి కారణమని తెలిపారు. ప్రస్తుతం రబీ సీజన్‌కు సంబంధించి 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి తరలిస్తున్నామని, ఇంకా లక్ష మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ధాన్యం నిల్వ కోసం చిట్యాల మార్కెట్ యార్డులోని షెడ్-1ను తాత్కాలిక గోదాముగా మార్చి వినియోగిస్తున్నట్లు తెలిపారు. అదనపు నిల్వ స్థలాల ఏర్పాటు, హమాలీల సంఖ్య పెంపు కోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

అనంతరం కలెక్టర్ చిమనగుంటపల్లి శివారులోని లక్ష్మీ వెంకటేశ్వర గోదామును సందర్శించి అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ధాన్యం అన్‌లోడింగ్ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,  డీసీఎస్ఓ కాశీ విశ్వనాథ్, డీఆర్‌డీఓ ఉమాదేవి, కార్మిక శాఖ అధికారి రవి, మార్కెటింగ్ శాఖ అధికారి స్వరణ్ సింగ్, డీసీవో రాణి, జిల్లా మేనేజర్ సివిల్ సప్లై ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: రేపు ఈఆర్సీ ముందుకు బీఆర్ఎస్ బృందం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>