కలం, వెబ్ డెస్క్ : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవెర్చలేని సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని మాజీ మంత్రి రోజా (RK Roja ) అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో రోజా మాట్లాడుతూ.. ప్రజల దృష్టిని మళ్లించడానికే వైసీపీ గొడ్డలి పార్టీ అని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే తమది గొడ్డలి పార్టీ కాదని.. టీడీపీనే గొడ్డలి పార్టీ అని ఆమె ఆరోపించారు. వివేకా హత్య కేసులో టీడీపీ ప్రమేయం ఉందని సంచలన ఆరోపణ చేవారు.
మరోవైపు టీడీపీ మహానాడుపై మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశారు. స్టేజ్ ల మీద రికార్డింగ్ డాన్సులు పెట్టి.. ప్రజలను తీసుకువచ్చే ఎత్తుగడలు వేశారని.. టీడీపీ పెట్టింది మహానాడు కాదని, దగానాడు అని ప్రజలకు అర్థం అయిపోయిందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతోషంగా లేరని చెప్పారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని కూటమి ప్రభుత్వం.. హామీలపై నిలదీస్తున్న వైసీపీ వాళ్లును అరెస్ట్ చేస్తున్నారని రోజా అన్నారు. మాజీ సీఎం జగన్ పీఏను సైతం అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు. అయితే ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చాలా కేసులు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

