కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) ప్రారంభం అయింది. ఈ నెల 20వ తేదీ వరకు మొత్తం 9 రోజులపాటు టెట్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 97 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. ఇప్పటికే టెట్‌కు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. అయితే ఈసారి టెట్‌కు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పేపర్-1, పేపర్-2 కలిపి మొత్తం 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 71,670 మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఉండటంతో ఈ సారి టెట్‌కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
ఇన్ సర్విస్ ఉపాధ్యాయులకూ టెట్ (TG TET) తప్పనిసరి చేయడంతో వారు కూడా ఈసారి పరీక్షకు హాజరవుతున్నారు. పేపర్-1 ,పేపర్-2 కు సంబంధించిన పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే నిర్వహణలో ఎలాంటి నిర్వహణ లోపాలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు పరీక్షకు కనీసం గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. త్వరలో డీఎస్సీ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉండటంతో టెట్ పరీక్ష డీఎస్సీకు కీలకం కానుంది.


