కలం వెబ్ డెస్క్ : శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి (Budda Rajashekar Reddy) వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. ఓ మహిళతో ఆయన ప్రవర్తించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఏపీలో భూ పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో భాగంగా ఓ మహిళ బుడ్డాతో వాగ్వాదానికి దిగింది. దీంతో బుడ్డా ఆమె మీద విరుచుకుపడ్డారు. సీఎం రిలీఫ్ ఫండ్(CM Relief Fund) విషయంలో మొదలైన చర్చ కాస్తా ఇద్దరి మధ్య వాగ్వాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. భూ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ సందర్భంగా శనివారం బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరులో నిర్వహించిన సమావేశంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి (Budda Rajashekar Reddy) పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారతి అనే మహిళ హాజరైంది. భారతి మనవడు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ అందించి ఆదుకోవాలని భారతి ఎమ్మెల్యేను వేడుకుంది. ఇప్పటికే పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా సాయం చేయడం లేదని నిలదీసింది. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. ఏం తమాషా చేస్తున్నావా? నేను ఎవరు అనుకుంటున్నావు? నీ కమాండ్ ఏమిటి? ఏంటి నువ్వు గట్టిగా అడుగుతున్నావు? అసలు నువ్వు ఏం అనుకుంటున్నావు? అని మండిపడ్డారు. దీంతో మహిళ ఏంటి నన్ను చంపిస్తావా? అంటూ ఎదురు ప్రశ్నించింది. పోలీసులు(Police), స్థానిక నాయకులు జోక్యం చేసుకొని మహిళను పక్కకి తీసుకెళ్లారు.
అయితే గతంలో సైతం సదరు మహిళ తన మనవడి ఆపరేషన్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎమ్మెల్యేను సంప్రదించినట్లు సమాచారం. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరి వద్ద గోడు వెళ్లబోసుకుంది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తనకు ఆర్థికసాయం అందింది. ఇప్పుడు మళ్లీ మరో ఆపరేషన్ కోసం సాయం చేయాలని వేడుకుంది. నిబంధనల ప్రకారం ఒక్కసారి సీఎం రిలీఫ్ ఫండ్ అందిన తర్వాత మరో మూడేళ్ల వరకు ఎలాంటి సాయం పొందరాదని ఎమ్మెల్యే మహిళకు వివరించారు.


