కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పూర్తి గడువును నాలుగు నెలలు పొడిగించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ముడిసరుకుల ధరలు పెరగడం, నిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో ప్రాజెక్టులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని బిల్డర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లకు గణనీయమైన ఊరట లభించనుంది.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం–2016లోని సెక్షన్ 6 నిబంధన ప్రకారం ఈ గడువు పొడిగింపును అమలు చేశారు. నిర్మాణ రంగంపై అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే గృహ కొనుగోలుదారుల హక్కులు యథాతథంగానే ఉంటాయని, రెరా నిబంధనల ప్రకారమే ప్రాజెక్టుల పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.

