కలం, స్పోర్ట్స్: FIH పురుషుల, మహిళల హాకీ ప్రపంచకప్‌కు ముందు భారత హాకీ జట్టు కొత్త జెర్సీ రంగు మార్పు చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయ నీలం రంగుకు బదులుగా కాషాయ రంగు జెర్సీని ప్రవేశపెట్టడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేయగా, భారత జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్(Hardik Singh) ఈ నిర్ణయంపై స్పష్టత ఇచ్చారు. నెదర్లాండ్స్, బెల్జియం వేదికలుగా ఆగస్టు 14, 15 తేదీల నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్ కోసం ఈ కొత్త జెర్సీని తీసుకొచ్చారు. అయితే జెర్సీ రంగు మార్పుపై మాజీ కెప్టెన్ విరేన్ రస్కిన్హాతో పాటు కొందరు రాజకీయ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
దీనిపై హార్దిక్ సింగ్ స్పందిస్తూ.. జెర్సీ మార్పు వెనుక కేవలం ఆటకు సంబంధించిన కారణాలే ఉన్నాయని తెలిపారు. నీలం రంగు ఆస్ట్రోటర్ఫ్ మైదానంలో కొన్నిసార్లు స్పష్టంగా కనిపించకపోవడంతో ఆటగాళ్లకు ఇబ్బందులు ఎదురయ్యేవని, అందుకే కొత్త రంగును ఎంపిక చేసినట్లు చెప్పారు. “ఇది నా మూడో ప్రపంచకప్. టోర్నీ కోసం మా సన్నాహాలు బాగా సాగుతున్నాయి. జెర్సీ మార్పు ఆటపై మెరుగైన ప్రభావం చూపాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం” అని హార్దిక్ పేర్కొన్నారు.
సాంకేతిక కారణాలతోనే కాషాయ రంగు ఎంపిక
జెర్సీ మార్పుపై హాకీ ఇండియా కూడా వివరణ ఇచ్చింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ హాకీ మైదానాలలో నీలం రంగు సింథటిక్ సర్ఫేస్‌తో కలిసిపోవడం వల్ల ఆటగాళ్ల కదలికలు స్పష్టంగా కనిపించకపోయే అవకాశం ఉందని హాకీ ఇండియా వివరించింది. అందుకే పసుపు, కాషాయ రంగులను పరిశీలించి చివరకు కాషాయ రంగును ఖరారు చేసినట్లు పేర్కొంది. కాషాయ రంగు భారత జాతీయ పతాకంలో భాగమని, ఇది ధైర్యం, దేశభక్తికి ప్రతీకగా నిలుస్తుందని హాకీ ఇండియా తెలిపింది. గతంలో 2014 ప్రపంచకప్‌లో పసుపు రంగు, 2018 ప్రపంచకప్‌లో స్కై బ్లూ రంగు జెర్సీలను కూడా ఉపయోగించినట్లు గుర్తు చేసింది.
ఆటపై దృష్టి పెట్టిన హార్దిక్
జట్టులో వాతావరణం గురించి కూడా హార్దిక్ సింగ్ మాట్లాడారు. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల మధ్య ఎలాంటి తేడాలు లేవని, ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉందని చెప్పారు. మైదానంలో బంతిని కోల్పోయే పరిస్థితులను తగ్గించుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. రిసీవింగ్, పాసింగ్‌తో పాటు ప్రత్యర్థుల వ్యూహాలను అర్థం చేసుకోవడంపై ఎక్కువగా శ్రమిస్తున్నానని వెల్లడించారు. ప్రపంచకప్‌లో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని హార్దిక్ సింగ్ తెలిపారు.

