కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలను (Diet Cosmetic Charges) రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటివరకూ ప్రతీ మూడు నెలలకు ఒకసారి విడుదల చేయాలన్న నిబంధన అమలవుతున్నది. ఇక నుంచి ప్రతి నెలా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న స్కూళ్లు, హాస్టళ్ళకు అద్దె డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మూడు అవసరాలకు మొత్తం ర. 221.24 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇకపైన నెలవారీ విడుదల చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహ పాఠశాలల నిర్వహణకు ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించినట్లవుతుంది.
సామాజికంగా వెనుకబడిన, బలహీనవర్గాల విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యా వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని సంస్థలకే కాకుండా విద్యాశాఖ పరిధిలోనివాటికి కూడా రిలీఫ్ లభించినట్లయిందని ఒక ప్రకటనలో డిప్యూటీ సీఎం తెలిపారు. గతంలో తొమ్మిది నెలల తర్వాత బిల్లులు విడుదలయ్యేవని, దీంతో ప్రైవేటు భవనాల్లోని పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణకు ఇబ్బందులుండేవని గుర్తుచేశారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకే క్వార్టర్లీ విధానం స్థానంలో మంత్లీ పద్ధతి తీసుకొచ్చినట్లు వివరించారు.

