కలం, క్రైమ్ బ్యూరో: బక్రీద్ (Bakrid) పండుగ సమీపిస్తున్న తరుణంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో ఓ వర్గానికి చెందిన యువకులు గుడిమల్కాపూర్ వద్ద ఓ లారీని అడ్డుకున్నారు. దీనిని వ్యతిరేకించిన మరో వర్గం యువకులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ వర్గానికి చెందిన వారు లారీపై రాళ్లు రువ్వరు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సైన్ తన అనూచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం అలర్ట్ అవుతోంది.
పశువుల అక్రమ రవాణా, సోషల్ మీడియాపై నిఘా
పశువుల అక్రమ రవాణాపై పోలీసులు నిఘా పెంచారు. అనేక ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది సంఖ్యను పెంచారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సున్నిత ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఇతర పోలీస్ అధికారులు గోరక్షక్ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పండుగ వేళ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిషనరేట్ సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తూ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని సజ్జనార్ వెల్లడించారు. గోరక్షకులు చట్టం పట్ల అత్యంత గౌరవంతో ఉండాలని, అక్రమ పశు రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా తక్షణమే పోలీసులకు తెలియజేయాలి తప్ప, ఏ పరిస్థితుల్లోనూ ప్రత్యక్ష దాడులకు పాల్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు.నిబంధనలు అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.పశువుల అక్రమ రవాణాతో పాటు సోషల్ మీడియాపై కూడా పోలీసులు నిఘా పెంచారు. పశువధకు సంబంధించి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా లేదా ఉద్రిక్తతలు పెంచేలా సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు పోస్ట్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా వాహనాలను వెంబడించడం లేదా దారిలో అడ్డంకులు సృష్టించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 203 చెక్‌పోస్టులు
బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 203 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో 52 అంతరాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.చెక్ పోస్టుల వద్ద పశువుల రవాణాకు సంబంధించిన ‘ఫీట్ టు ట్రాన్స్‌పోర్టేషన్’, ‘ఫిట్ టు స్లాటర్’ వంటి ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పండుగ ముగిసే వరకు ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగాలని ఆయన ఇప్పటికే పోలీస్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గందరగోళం సృష్టించేలా పోస్టులు పెట్టే వారిని స్టేషన్లకు పిలిపించి హెచ్చరించాలని ఆదేశించారు.

