కలం, సూర్యాపేట : సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు రోడ్డుపై బైఠాయించారు. సూర్యాపేట పట్టణంలోని 2వ వార్డు, కుడకుడ జంగాల కాలనీకి చెందిన తిరుపాటి లక్ష్మయ్య (38) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అయితే లక్ష్మయ్య మృతిపై పోలీసులు తమకు ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఏరియా ఆసుపత్రి ఎదుట మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు భారీ ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా వారు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కేసులో నిందితులను పోలీసులు కాపాడుతున్నారని బాధితులు బహిరంగంగా ఆరోపించారు. గురువారం ఉదయం లక్ష్మయ్యను తీసుకెళ్లిన ఆ ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, పెన్ పహాడ్ మండల పోలీస్ స్టేషన్ నుండి అధికారులు ఇంతవరకు ఆసుపత్రికి చేరుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరగంటకు పైగా కొనసాగుతున్న ఈ ధర్నాతో సూర్యాపేట (Suryapet) ఏరియా ఆసుపత్రి ముందు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్ ఎగ్జామ్స్ : ధర్మేంద్ర ప్రధాన్
Follow Us On: X(Twitter)

