కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ లో తనదైన ముద్ర వేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ క్రీడాకారుడు లియాండర్ పేస్ (Leander Paes) ఇప్పుడు రాజకీయంలోకి అడుగు పెట్టారు. మంగళవారం ఆయన భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో లియాండర్ పేస్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వం ఆయనకు సాదర స్వాగతం పలికింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పేస్ వంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వ్యక్తి పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. క్రీడా రంగంలో దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ఆయన, ఇప్పుడు ప్రజా సేవలో కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని భావిస్తున్నారు. బెంగాల్ గడ్డపై బీజేపీ బలాన్ని పెంచడంలోనూ, ముఖ్యంగా యువతను ఆకర్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ తరఫున లియాండర్ పేస్ (Leander Paes) విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బెంగాల్ మూలాలున్న క్రీడాకారుడిగా అక్కడ ఆయనకు ఉన్న ఆదరణ పార్టీకి కలిసి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కోర్టులో టెన్నిస్ రాకెట్‌తో ప్రత్యర్థులను చిత్తు చేసిన ఈ ఛాంపియన్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో ఓటర్ల మనసును ఎలా గెలుచుకుంటారో చూడాలి.
Read Also: ఇరాన్ పై యుద్ధం ఆపొద్దు.. ట్రంప్ కు గల్ఫ్ దేశాల రిక్వెస్ట్
Follow Us On: X(Twitter)

