కలం, నల్లగొండ బ్యూరో : కోట్లు పలికే భూముల ధరల ముందు ఆ దేవుడి మహిమ కూడా కబ్జాకోరులకు తక్కువగానే కనిపిస్తోంది. కొండలను పిండి చేసి.. కోనేటి తీరాన అపచారాలు చేస్తూ.. నల్లగొండ (Nalgonda) జిల్లాలో దేవుడి ఆస్తిని దౌర్జన్యంగా దోచేస్తున్నారు. కష్టం వస్తే కాపాడే కలియుగ దైవానికే కష్టం వచ్చింది. భక్తుల పాపాలను కడిగేసే ఆ స్వామి భూములను కబ్జాకోరుల పాపపు అడుగులు మింగేస్తున్నాయి. జిల్లాలోని పెద్దకాపర్తిలో వెయ్యేళ్ల చరిత్ర గల తిరుమలనాథుడికి చెందిన వేల ఎకరాల భూములు, అధికారుల కళ్ల ముందే భూమాఫియా పాలవుతుంది. ఒకప్పుడు 2వేల ఎకరాలు.. నిన్న మొన్నటి వరకు 102 ఎకరాలు.. నేడు కేవలం 77 ఎకరాలు.. నల్లగొండ జిల్లా జాతీయ రహదారి పక్కన ఉన్న తిరుమలనాథ ఆలయ భూములు కరిగిపోతున్న తీరిది. ఎకరా నాలుగు కోట్లు పలుకుతుండటంతో రాత్రికి రాత్రి కొండలను తొలిచేస్తూ వెంచర్లు, హోటళ్లతో స్వామి వారి ఆస్తులను ల్యాండ్ మాఫియా గుటకాయస్వాహా చేస్తోంది. అయినా అధికారుల్లో ఏమాత్రం చలనం లేకుండా పోతోంది.
ఎకరం రూ.4కోట్లకు పైనే..
మనకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మొదట గుర్తుకొచ్చేది ఆ దేవుడే. కానీ నల్లగొండ జిల్లాలో మాత్రం కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామికే ఘోరమైన అన్యాయం జరుగుతోంది. చిట్యాల మండలం పెద్దకాపర్తి శివార్లలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి 65ని ఆనుకొని వెయ్యేండ్లకు పైగా చరిత్ర కలిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి (తిరుమలనాథ) ఆలయం ఉంది. ఒకప్పుడు ఈ ఆలయానికి తాతలు, తండ్రుల కాలంలో దాదాపు 2,000 ఎకరాలకు పైగా భూములు ఉండేవి. నల్లగొండ జిల్లాలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాకోరుల కన్ను ఈ దేవుడి భూములపై పడింది. “కొనడం కంటే కొట్టేయడమే సులువు” అన్న చందంగా ఇక్కడి భూమాఫియా రెచ్చిపోతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఇక్కడి ఎకరా భూమి ధర దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు పలుకుతుండటమే ఈ ఆగడాలకు ప్రధాన కారణమయ్యింది.
కర్పూరంలా కరిగిపోతున్న దేవుడి భూమి..
భూమాఫియా మాయాజాలం వల్ల ఒకప్పుడు 2వేల ఎకరాలు ఉన్న ఆలయ భూమి, కాలక్రమేణా 102 ఎకరాలకు, ఇప్పుడు అది కాస్తా కేవలం 77 ఎకరాలకు పడిపోయింది. ఆలయ గుట్ట వెనుక భాగంలో ఒక వ్యాపారి ప్రైవేట్ వెంచర్ (ప్లాట్ల వ్యాపారం) ప్రారంభించాడు. ఆ వెంచర్‌కు సరైన దారి లేకపోవడంతో రాత్రికి రాత్రి పెద్ద హిటాచీ మిషన్లను తీసుకొచ్చి దేవుడి కొండనే తొలిచేశారు. దాదాపు ఒక కిలోమీటరు పొడవు, 50 అడుగుల వెడల్పుతో గుట్టను తవ్వి రోడ్డు వేశారు. ఈ ఒక్క ల్యాండ్ మాఫియా దెబ్బకు దాదాపు 10 ఎకరాల దేవాలయ భూమి ఆక్రమణకు గురైంది. మరోవైపు హైవేను ఆనుకొని ఉన్న ఆలయ భూముల్లో ఏకంగా ఒక పెద్ద హోటల్ వెలిసింది. ఆలయ భూమిని కబ్జా చేయడమే కాకుండా, హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా ఆలయ కోనేటి పక్కనే నిత్యం మాంసాహార వంటకాలు వండుతూ ఆ వ్యర్థాలను అక్కడే పారబోస్తూ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. ఒకవైపు కొండపై నిత్య పూజలు, బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే.. కింద ఇలాంటి అపచారాలు జరగడంపై స్థానికులు మండిపడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం – స్థానికుల ఆవేదన
ఈ అన్యాయాలపై స్థానిక యువత, భక్తులు ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు ఆర్‌డీఓ రెండు సార్లు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి, ఆలయ భూములకు హద్దులు కూడా నిర్ణయించారు. అయినప్పటికీ, దేవాదాయ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కబ్జాలను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. “దేవుడికే దిక్కు లేదు.. మిమ్మల్ని కాపాడేది ఎవరు?” అంటూ కబ్జాకోరులు భక్తులను బెదిరిస్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది. దేవుడి ఆస్తులను రక్షించాల్సిన దేవాదాయ శాఖ అధికారుల ఉదాసీనత వల్లే భూమాఫియా ఇంతగా రెచ్చిపోతోంది. ఆధ్యాత్మిక కేంద్రాలను, ప్రకృతి సిద్ధమైన కొండలను కూడా కేవలం లాభాల కోసం ధ్వంసం చేసే వ్యాపార సంస్కృతి పెరిగిపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో ఆ వెయ్యేండ్ల చరిత్ర కలిగిన తిరుమలనాథుడికి గుడి తప్ప చుట్టుపక్కల ఎలాంటి భూమి మిగలని పరిస్థితి వస్తుంది. పవిత్రమైన ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అసాంఘిక, అపవిత్ర కార్యకలాపాలను తక్షణమే అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

